‘బంగారంపై దుష్ప్రచారం’

25 April, 2019 - 4:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: టీటీడీ బంగారం తరలింపుపై విపక్షాలు ఓ విధమైన దుష్ప్రచారం చేస్తున్నరని టీడీపీ సీనియర్ నాయకుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఈ అంశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీరును, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ బంగారం తరలింపుపై స్పష్టత ఇవ్వాలంటూ టీటీడీ అధికారులను ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ బంగారం తరలింపుపై వైయస్ఆర్ సీపీ నేతలు, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు .. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మద్దతు తెలిపే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని వైవీబీ రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. గురువారం అమరావతిలో బాబు రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈవీఎంల్లో అవకతవకలపై సీఎం చంద్రబాబు దేశవ్యాప్తంగా చేస్తున్న ఉద్యమానికి మంచి స్పందన వస్తుందన్నారు.

గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయి… ఈ నేపథ్యంలో బీజేపీతో కలసి ఈ అంశంపై టీడీపీ పోరాటం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈవీఎంల్లో అవతవకలకు పాల్పడుతున్నందునే ..మళ్లీ పోరాటం చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.