‘శ్రీవారి ఆభరణాలపై విచారణ’

22 June, 2019 - 6:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల: తిరుమల శ్రీవారి ఆభరణాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేశారు. గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డి చేత ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణం చేయించారు.

తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. అర్చకుల సమస్యలపై పీఠాధిపతులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారని గుర్తు చేశారు.

వాటిని అనుగుణంగా నడుచుకుంటానని వెల్లడించారు. శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు సీఎం జగన్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి పాలక మండలి ఏర్పాటవుతుందన్నారు. టీటీడీ ఉద్యోగుల సమస్యలు సైతం పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, దిల్ రాజు హాజరయ్యారు.

ప్రకాశం జిల్లా మేదరమెట్లకి చెందిన వైవీ సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి స్వయానా తోడల్లుడు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలుకై తీవ్ర పోరాటం చేశారు. ఆ క్రమంలో ఏపీలోని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ వైయస్ జగన్..పార్టీ గెలుపు కోసం క్రీయాశీలకంగా వ్యవహారించాలని ఆదేశించారు.

దాంతో ఆయన పోటీ చేయకుండా.. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ ఘన విజయం సాధించడంతో .. వైవీ సుబ్బారెడ్డికి సీఎం వైయస్ జగన్ .. టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.