సమయం ఆసన్నమైంది

13 May, 2019 - 6:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: భాగ్యనగరంలో లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలి వెళ్తుంది. సోమవారం .. ప్రధాన కార్యాలయంలోని సామాగ్రిని అమరావతిలోని పార్టీ కార్యాలయాలనికి తరలించడం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయంలోని మొత్తం సామాగ్రిని తరలించడానికి దాదాపు వారం రోజులు పడుతుందని లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

అమరావతి పరిధిలోని తాడేపల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ మోహన్ రెడ్డి .. ఇటీవలే కొత్తగా నివాసం గృహం నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 200 కోట్లతో నిర్మించిన ఈ భవనంలోనే వైయస్ జగన్ నివాసంతోపాటు పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు.

ఈ నివాసంలోకి వైయస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న గృహప్రవేశం చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి నెలాఖరున వైయస్ జగన్ ఈ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన విషయం విదితమే. ఆ మరునాడే వైయస్ జగన్ హైదరాబాద్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

అయితే మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్‌లోని కార్యాలయం అమరావతికి తరలి వెళ్తుంది.

కాగా మే 16న అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అధ్యక్షతన ఎంపీ, ఎమ్మెల్యే, కౌంటింగ్ అభ్యర్థలకు శిక్షణ ఇవ్వనున్నారు. మే 21వ తేదీ సాయంత్రానికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలంతా అమరావతిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మే 22వ తేదీ అమరావతికి వెళ్లనున్నారు. మే 23వ తేదీ ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.

సీఎం చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఇల్లు ఉన్నా.. ఉండవల్లిలో ఉంటూ.. పాలన సాగిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి కూడా హైదరాబాద్‌లో ఇల్లు ఉన్నా.. విజయవాడలో ఇల్లు అద్దెకు తీసుకుని మంగళగిరిలో ఆయన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు.

దాంతో వైయస్ జగన్ కూడా.. అమరావతికి పయనమయ్యారు. అదీకాక వైయస్ జగన్‌ని టార్గెట్ చేసిన చంద్రబాబు… పలు సందర్భాల్లో వైయస్ జగన్.. లోటస్ పాండ్ వదిలి రారంటూ ఆరోపణలు పలు మార్లు గుప్పించిన సంగతి తెలిసిందే.