అడుగులా! తప్పటడుగులా!

22 September, 2018 - 6:12 PM

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర సెప్టెంబర్ 24వ తేదీ అంటే సోమవారం మరో మైలు రాయిని దాటనుంది. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. ఆయన పాదయాత్ర చేపట్టి దాదాపు 266 రోజులు పూర్తి చేసుకుంది.

అయితే వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఓ వైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతోంటే.. మరో వైపు అధికార పార్టీతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. వైయస్ జగన్ పాదయాత్ర వల్ల రాష్ట్రానికి లాభమా లేకుంటే.. ఆయన పార్టీకి మైలేజ్ వస్తుందా? అనే అంశంపై రాష్ట్ర ప్రజల్లో పలు చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

వైయస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదీన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  అంతకు కొద్ది రోజుల ముందే వైయస్ జగన్‌తోపాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీని బాయి కాట్ చేశారు. ఆ తర్వాత వైయస్ జగన్ అండ్ బ్యాచ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టిన రోజు లేదు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్షమే అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అధికార పక్షమే.. ప్రతిపక్షం పాత్రను నిర్వహిస్తూ.. తెలుగుదేశం పార్టీ డబుల్ రోల్ పోషించింది…. పోషిస్తోంది.

అయితే ప్రతిపక్షం అనేది.. అధికార పక్షానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలి. ఆ క్రమంలో ప్రజల పక్షాన నిలబడి… ప్రజా సమస్యలపై గళమెత్తి.. అధికార పక్షాన్ని ఊపిరి తీసుకోనివ్వకుండా చేయాలి. ఇంకా చెప్పాలంటే… అసెంబ్లీకి రావాలంటే అటు సీఎం.. ఇటు ఆయన కేబినెట్‌కి వెన్నులో వణుకు తెప్పించేది ఉండాలి.

అందుకోసం అధికార పక్షంలో నాయకుల తీరు అయితేనేమీ… ప్రభుత్వ పథకాల అమలు అవుతున్న తీరులో అయితేనేమీ.. ఎక్కడ తప్పు దొరుకుతుందా అని రంధ్రాన్వేషణ చేసేటట్లు ఉండాలి. అప్పుడే ప్రతిపక్షం ప్రజలు హృదయాలను కొల్లగొడుతోంది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని సైతం కట్టబెట్టేందుకు ప్రజలు క్యూలో నిలబడి మరీ ఓట్లు వేసి.. బ్యాలెట్ బాక్సలు నింపుతారు.

కానీ కళ్ల ముందే సమస్యలు కనబడుతున్నా.. ప్రజా సమస్యలు అంటూ పాదయాత్ర పేరుతో అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రజలే నుంచే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని బట్టే ప్రజలు అర్థం చేసుకున్న విధానం అవగతమవుతోంది.

విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో అధికార పక్షంతో కలసి వెళ్లి… కేంద్రం మెడలు వచ్చి… హోదాను తీసుకు వచ్చేందుకు అలుపెరగని పోరాటం చేయాలి. ఏదో చేశాం. అదీ తూతూ మంత్రం అంటే సరిపోదు.

అదీకాక.. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఒక్క రోజులో 11 బిల్లులు పాస్ చేసింది. అలాగా ఎన్నో బిల్లులు ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రభుత్వ పాస్ చేసేంది. వీటిపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారే ప్రస్తుతం కరువైయ్యారు. అదే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండి ఉంటే.. ఈ బిల్లులపై అధికార పార్టీని సవా లక్ష ప్రశ్నలు వేసి.. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేది.

కానీ ఈ ఛాన్స్‌ ను కూడా ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్ చేసుకుంది. అంతేకాదు ఈ బిల్లులలో పలు లోపాలు ఉండి ఉంటే వాటిని అసెంబ్లీ సాక్షిగా ఎలుగెత్తి చాటితే అధికార పార్టీ మీనమేషాలు లెక్కించేది. దీంతో ఆ క్రెడిట్ అంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నేడు ఆ అవకాశం ఈ ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ లేకుండా పోయింది.

ఉదాహరణకు గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోమయాజుల కమిషన్.. తాజాగా నివేదిక ఇచ్చింది. అందులో మీడియాతోపాటు పురోహితుల తప్పుల వల్లే ఆ ఘోరం జరిగినట్ల సదరు నివేదికలో కమిషన్ పేర్కొంది.

ఈ నివేదికపై ప్రజలు మండిపడుతున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగిందో అందరికి తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సాహాయత ప్రజలతి. అదే ప్రతిపక్షం అసెంబ్లీలో ఉంటే అధికార పార్టీని ఈ అంశంపై మూడు చెరువుల నీళ్లు తాగించేదని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, పండితులు, ప్రజలు  అభిప్రాయపడుతున్నారు.

పోనీ పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్ రాజమహేంద్ర వరం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ అంశంపై ఒక్క మాటైనా మాట్లాడలేదని స్థానిక ప్రజలే చర్చించుకుంటున్నారు.  అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా ప్రజలను పట్టించుకునే పరిస్థితిలో లేదని ఆంధ్రప్రజానీకం వాపోతుంది.

అధికార పక్షం బాధ్యత మరచి ప్రవర్తిస్తే… ప్రతిపక్షం… అధికార పక్షాన్ని హద్దుల్లో తీసుకు వచ్చి.. ఇది తప్పు అని నిగ్గ దీసి అడగాలి. కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజా సమస్యలు పేరుతో కాలయాపనగా .. పాదయాత్ర చేస్తూ వెళ్లితే… ఆ తర్వాత ఎన్నికలు వస్తే…. మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవచ్చు అనే ఒక్కే ఒక్క ఆలోచనలో ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. ఎమ్మెల్యేలకు రావాల్సిన జీత భత్యాలతోపాటు ఇతర అలవెన్స్ అందుకొంటూ ప్రజాధానాన్ని మాత్రం కైంకర్యం చేస్తున్నారని అధికార టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

పోనీ ప్రతిపక్ష పార్టీ తరఫున ఎంపీలు లోక్‌సభలో అడుగుపెట్టిన వారు కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వల్ల ఆంధ్రదేశానికి ఒరిగింది ఏమీ లేదనే భావనలోకి ప్రజలు వెళ్లిపోయారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏవిధంగా ఏ పార్టీ ఎలా బుద్ది చెబుతారు అనేది మరి కొద్ది రోజులు అగితే కాని తెలియదు. ఎందుకంటే… ప్రజలు వెర్రివెంగళప్పలు మాత్రం కాదు…

రోడ్డు మీదకు ఏ నాయకుడు వచ్చినా.. ప్రజలు వస్తారు.. ఆయన్ని చూస్తారు… ఆయన చెప్పింది వినడానికి .. కానీ ఆ తర్వాత ఎన్నికల్లో పోలింగ్ బుత్‌లకు వచ్చి.. లైన్‌లో నిలబడి.. బ్యాలెట్‌పై ఎవరి గర్తుకు ఓటు వేస్తారనేది మాత్రం ఆ పెరుమాళ్లకే ఎరుక. ఎందుకంటే.. ప్రజలు విజ్ఞలు.. వారు ఎలా చెబితే… అలాగే వారు ఓటు వేసిన నాయకులే అధికారాన్ని చేపడతారు అనేది మాత్రం అక్షర సత్యం.

-జి.వి.వి.ఎన్. ప్రతాప్