‘వెళ్లేది లేదు’

16 May, 2019 - 2:11 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్న తరుణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పార్లమెంట్ జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్లకు విధులు, బాధ్యతలు వివరించామన్నారు. టీడీపీ నేతలు ఓటమి భయంతోనే అసహనానికి గురవుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం అందలేదని.. ఓ వేళ ఆహ్వానం వచ్చినా వెళ్లేది లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ శిక్షణా తరగతులకు దాదాపు 400 మంది వచ్చారని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్‌లు అజేయ్ కల్లాం, శామ్యూల్, విజయసాయిరెడ్డి తదితరులు వారికి శిక్షణ ఇచ్చారని చెప్పారు.