‘కర్పూరంలా కరిగించారు’

04 December, 2019 - 11:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కర్నూలు: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కి వెళ్లే మాపైనే కేసులు పెట్టడం దారణమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ శ్రేణులు దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

ఇలాగే పరిపాలన జరిగితే రాష్ట్రం దివాళ తీయడం ఖాయమని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో చంద్రబాబు విలేకర్లతో మాట్లాడుతూ…. వైయస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ. 1600 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారని ఆయన తెలిపారు.

జగన్ టెర్రరిజం వల్ల సోలార్ వ్యవస్థ మొత్తం దెబ్బతిందన్నారు. కర్నూలు జిల్లాలో రూ. 8 వేల కోట్లతో ప్రాజెక్టులు కట్టామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. రాజధానిలో రూ. 2 లక్షల కోట్ల సంపదను కర్పూరంలా కరిగించారని వైయస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఎవరినో బలిపశువును చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.

మీపై నమ్మకం లేదని.. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదే పదే అవాస్తవాలు ప్రచారం చేయడం వల్లే ఎన్నికల్లో తాము ఓడిపోయామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు ఏళ్లలో ఎన్నికలు వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. 22 మంది ఎంపీలతో ఏం సాధించారని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అమ్మే హక్కు వీరికి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల ఆస్తులేలా అమ్ముతారంటూ వైయస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

వైయస్ జగన్ ప్రభుత్వం చేతగానితనం వల్ల కిలో ఉల్లి రూ. 110కి చేరిందని చంద్రబాబు చెప్పారు. జే ట్యాక్స్, మీ ముడుపుల కోసమే మద్యం ధరలు పెంచారంటూ వైయస్ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు సంధించారు. మద్యం ధర 150 నుంచి 200 శాతం పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. బెల్ట్ షాపులు ఇంటికొకటి చొప్పున తయారయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం ఎక్కువై ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ, తమిళనాడు నుంచి మద్యం ఏపీకి వస్తుందన్నారు చంద్రబాబు. అలాగే ఇసుక పేరుతో ఎక్కడికక్కడ దోచుకుంటున్నారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఇసుక తరలిపోతుందని చంద్రబాబు ఆరోపించారు. ఆన్ లైన్, స్టాక్ పాయింట్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసు ఎస్కార్ట్ పెట్టి ఇసుక వాహనాలను తరలిస్తున్నారని.. సిమెంట్, స్టీల్, ఇతర అనుబంధ రంగాలను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శించారు. ముందు ముందు అప్పులు పుట్టే పరిస్థితి కూడా ఉండదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ 7 నెలల పరిపాలనలో అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయిందన్నారు. వీరి పాలన వల్లా సీడ్ క్యాపిటల్, సోలార్ హబ్ దెబ్బతిన్నాయని చంద్రబాబు చెప్పారు.