పవన్ స్టైల్‌లో జగన్

12 January, 2019 - 2:10 PM

 

ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు పక్కా క్లారిటీగా టీఆర్ఎస్‌కి ఓటు వేసి అధికారం పీఠం అప్పచెప్పారు. కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో మాత్రం రాజకీయం యమ రంజుగా సాగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారంటే … రాజకీయ విశ్లేషకులు సైతం మౌనం పాటిస్తున్నారు.

కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదేనని ధీమాగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి విజయవాడ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తనదైన స్టైల్‌లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఆ క్రమంలో వివిధ జిల్లాల నేతలో ఆయన నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహించడం.. ఆయా జిల్లాల్లోని సమస్యలను అడిగి తెలుసుకోవడం .. వారికి దిశా నిర్దేశం చేయడం.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్.

ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఏపీ రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటికే ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర వైయస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఏపీలో మరింత జోరు పెంచాలని వైయస్ జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయవాడ కేంద్రంగా పని చేస్తున్నారు. అలాగే వైయస్ జగన్ కూడా విజయవాడ కేంద్రంగా రాజకీయాలను నిర్వహించాలని నిర్ణయించుకునట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో వైయస్ జగన్ త్వరలోనే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచి విజయవాడకు మకాం మార్చేస్తున్నారని సమాచారం.

ఏపీ రాజకీయాలన్నీ గతంలో హైదరాబాద్ నుండే జరిగేవి. కానీ విభజన అనంతరం..మరీ ముఖ్యంగా రాజధాని మారిన తర్వాత ఏపీ రాజకీయాలు విజయవాడ కేంద్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ విజయవాడలో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. అది కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఈ నేపథ్యంలో వైయస్ జగన్ విజయవాడలో ఉంటే.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు.. అంతకు మించి ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను సైతం అకళింపు చేసుకోవడానికి మరింత వెలుసుబాటుగా ఉంటుందన్న ప్రధాన ఉద్దేశ్యంతో వైయస్ జగన్ విజయవాడకు మకాం మార్చేస్తున్నారని తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతికి మకాం మార్చి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కూడా ఇటీవల విజయవాడను వేదికగా చేసుకుని రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇక జగన్ కూడా విజయవాడ చేరితే ఏపీ రాజకీయం కొత్త పుంతలు తొక్కుంతుందని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

అదీకాక వైయస్ జగన్ హైదరాబాద్‌లో ఉండే ఏపీలో ప్రచారం చేస్తారా ? అని ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు సైతం విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనే ఉండి.. ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకోవాలని వైయస్ జగన్‌కు ముఖ్య అనుచరులు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు. అందుకు వైయస్ జగన్ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. దాంతో వైయస్ జగన్ కూడా ఇక విజయవాడ నుంచే పని చేయనున్నారు.