ఈ రచ్చేంటి.. రా.‘బాబూ..!’

27 June, 2019 - 5:05 PM


(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ‘ప్రజావేదిక’ నుంచే ప్రారంభం కావాలని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం అదే వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశించిన మరుక్షణం నుంచే టీడీపీ వర్గాలు రచ్చ మొదలెట్టేశాయి. కృష్ణానది ఒడ్డున కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన భవనంలో చంద్రబాబు అధికారికంగా నివాసం ఉండడంపై అనేక ఆరోపణలు, వాదోపవాదాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనం కోసమంటూ ప్రభుత్వ సొమ్ముతో మరో అక్రమ నిర్మాణం చేయడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలే ఉంది. తన నివాసానికి సమీపంలో ప్రజావేదిక పేరుతో నిర్మించిన ప్రభుత్వ భవనంలో.. ప్రభుత్వ వ్యవహారాల కన్నా టీడీపీ కార్యక్రమాలే ఎక్కువగా జరిగేవని, జరుగుతున్నాయనేది సుస్పష్టం.

సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు మొదలు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్‌ కూడా ఈ ప్రజావేదిక నుంచే టీడీపీ కార్యకలాపాలు నిర్వహించేవారనేది జగమెరిగిన సత్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయ ఎదురైన తర్వాత కూడా అదే వేదిక నుంచి టీడీపీ నాయకులు పార్టీ వ్యవహారాలు, సమావేశాలు నిర్వహిస్తున్న వైనం కూడా కాదనలేని నిజం. మొన్నటికి మొన్న మాజీ మంత్రి దేవినేని ఉమ గానీ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గానీ ఈ వేదిక నుంచే మీడియా సమావేశాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ ప్రజావేదిక అక్రమంగా, ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్మించింది కనుక జూన్ 26వ తేదీ నుంచే దీన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అదే వేదికలో సీఎం జగన్ కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్ఓడీలు, మంత్రులతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఇక మంగళవారం అంటే జూన్ 25న అన్ని జిల్లాల ఎస్పీలతో కూడా సమావేశం నిర్వహించిన అనంతరం 26 నుంచి ఈ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించారు. అయితే.. అక్రమ కట్టడమని చెబుతూనే.. అందులోనే తాను ఎందుకు ఈ సమావేశాలను నిర్విహిస్తున్నదీ కూడా స్పష్టంగా చెప్పడం గమనార్హం. ఈ అక్రమ కట్టడంలో ఇదే చివరి సమావేశం కావాలని ఆయన చెప్పడం విశేషం.

జగన్ ఆదేశాలపై టీడీపీ నేతలు ఒంటికాలిపై లేచి మరీ నిప్పులు చెరుగుతుండడం విడ్డూరంగా ఉంది. అది అక్రమ కట్టడమైతే అందులో ఎందుకు కలెక్టర్లు, ఎస్పీల సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ కొందరు టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రజావేదిక అన్ని రంగాల ప్రజల కోసం నిర్మించిందని, అలాంటి ప్రజోపయోగ భవనాన్ని ఎలా కూలగొడతారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తనకు కేటాయించాలని కోరడం వల్లే కూల్చివేయాలని సీఎం జగన్ నిర్ణయించారన్న మరికొందరు టీడీపీ నేతల ఆగ్రహంగా కనిపిస్తోంది. ప్రజావేదిక అక్రమ కట్టడమైతే.. అమరావతిలో 65 శాతం నిర్మాణం పూర్తయిన భవనాలను కూల్చేస్తారా?.. సెక్రటేరియట్ భవంతులను పడగొడతారా?.. నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును కూడా కూలదోస్తారా? అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వెటకరించడం గమనార్హం.

ప్రభుత్వ ఖర్చుతో కట్టిన ప్రజావేదికను కూల్చడం అనే ఆలోచనే తప్పు అని, దాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవాలనే మరికొందరు టీడీపీ నేతల ఉచిత సలహా కూడా ఇస్తుండడం విశేషం. కూలగొట్టడం ద్వారా జనం సొమ్మును దుర్వినియోగం చేస్తారా? అంటూ కూడా వారు ప్రశ్నిస్తుండడం వెనుక ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి మరి.

ప్రజావేదిక పేరుతో నిర్మాణ అంచనా వ్యయం 5 కోట్ల రూపాయల నుంచి ఎనిమిదిన్నర కోట్లకు పెంచేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ప్రజల కోసం అంటూ నిర్మించి ఆ భవనం దరిదాపుల్లోకి టీడీపీ కార్యకర్తలు, నేతలు తప్ప సాధారణ ప్రజలెవరినీ రానివ్వలేదని వస్తున్న ఆరోపణలకు చంద్రబాబు కోటరీ చెప్పే సమాధానం ఏమిటి? ప్రజావేదికను కూల్చవద్దంటూ టీడీపీ నేతలు వేస్తున్న రంకెల ద్వారా ఆ పక్కనే అక్రమంగా ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూలగొట్టవద్దనేది వారి అభిమతంగా ఉందా?
ప్రభుత్వం సొమ్ముతో కట్టించిన ప్రజావేదికను తన పార్టీ వ్యవహారాల కోసం కేటయించాలంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు అర్జీ పెట్టడం వెనుక రాజకీయం ఏమిటి? ప్రజల డబ్బుతో నిర్మించిన ఆ భవనాన్ని ఆయన తనకు కేటాయించాలని ఎలా అడుగుతారు? ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం చుట్టూ అలముకున్న ఈ మొత్తం ఎపిసోడ్‌పై చంద్రబాబు స్పందన ఎలా ఉండబోతోందనే అంశం ఆసక్తికరంగా మారింది.