‘ఎమ్మెల్యేలే ఇక మార్కెట్ కమిటీ ఛైర్మన్లు’

11 July, 2019 - 6:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: రాష్ట్రంలోని మార్కెట్ కమిటీలకు ఇకపై ఎమ్మెల్యేలనే గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాలోనూ వివిధ పంటలకు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ కరువుపై ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ… సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల హెక్టార్లు పంటలు పండుతాయని చెప్పారు. జులై రెండొ వారం వచ్చినా ఇప్పటికీ విత్తనం వేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఏం చేయబోతున్నామో సభ ముందు ఉంచుతున్నామని వైయస్ జగన్ స్పష్టం చేశారు.

రైతుల సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా విశదీకరించారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులు మాత్రమే అయిందని… స్వల్ప వ్యవధిలోనే రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 2, 300 కోట్ల పెట్టుబడి రాయితీని ఎగ్గొట్టి రైతులను మోసం చేసిందని విమర్శించారు.

అలాగే గత ప్రభుత్వ హయాంలోనే తీవ్రమైన కరవును చూశామని చెప్పారు. గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు సహాయం రూపంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం విత్తనాల సేకరణ కూడా చేయలేని పరిస్థితి ఉందన్నారు.
గత నవంబర్‌ మాసంలోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఏప్రిల్‌కు పూర్తికావాల్సి ఉందన్నారు.

తమ ప్రభుత్వం వచ్చేనాటికి విత్తన సేకరణ పూర్తయి, పంపిణీ జరుగుతుండాలని అభిప్రాయపడ్డారు. కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అధికారులు లేఖలు రాసినా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై గత ప్రభుత్వం స్పందించలేదని అధికారులు చెబుతుంటే బాధగా ఉందన్నారు. గతేడాది కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా రైతులకు బకాయిలు పెట్టారన్నారు.

విత్తన బకాయిలు రూ. 3, 84 కోట్లు ఉన్నాయని చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. గత ఐదేళ్లలో రుణాల రీషెడ్యూల్, కనీసం వడ్డీ చెల్లింపుల మాఫీ ఆలోచనే చేయలేదని చెప్పారు. వ్యవసాయ రుణాలు రూ. 87, 612 కోట్లు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పారని వైయస్ జగన్ గుర్తు చేశారు. పంటరుణాలు తీసుకున్న రైతులు గడువులోగా చెల్లిస్తే వడ్డీ ఉండదన్నారు.

వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 60 శాతం ఫీడర్లలో రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. వచ్చే జూన్ నాటికి 40 శాతం పీడర్లలో పగటి పూటే 9 గంటలకు విద్యుత్ ఇస్తామని చెప్పారు. 40 శాతం ఫీడర్లలో 9 గంటల విద్యుత్ సరఫరాకు రూ. 1700 కోట్లు ఖర్చు చేస్తున్నామని వైయస్ జగన్ చెప్పారు.

వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం తీసుకొచ్చామని, అలాగే వైయస్ఆర్ జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 55 లక్షల మంది రైతుల తరఫున రూ. 2064 కోట్ల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తున్నామన్నారు.

ఆయిల్ ఫాం రైతులకు అదనపు మద్దతు ధర కల్పిస్తూ రూ. 80 కోట్లు విడుదల చేసినట్లు వైయస్ జగన్ ప్రకటించారు. దీని ద్వారా లక్షా 10 వేల మంది రైతులకు లబ్ది కలుగుతుందన్నారు. పొగాకు ధరలు పడిపోతున్నసమయంలో వెంటనే స్పందించామని.. ఆ క్రమంలోన వ్యవసాయ మంత్రి కన్నబాబు అక్కడికి వెళ్లి బోర్డు అధికారులు, రైతులతో మాట్లాడారని వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత ప్రభుత్వం చెల్లించకుండా ఉంచిన పెట్టుబడి రాయితీ రూ. 2 వేల కోట్లను చెల్లిస్తామని చెప్పారు. వ్యవసాయ మిషన్‌లో రైతులు, శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారన్నారు. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే గతంలో ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని.. కానీ ఆత్మహత్య చేసుకున్న రైతన్న కుటుంబాలకు రూ. 7 లక్షల ఇస్తామని వైయస్ జగన్ ప్రకటించారు. తుపాన్లు, కరవులతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తామని పేర్కొన్నారు.

ఖరీఫ్‌లో కరవు వస్తే రబీలోనే ఆదుకునేందుకు విపత్తు సహాయ నిధి తీసుకొస్తున్నామని చెప్పారు. రైతులు కష్టాల్లో ఉంటే రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రైతుల ఆనందం కోసం వైయస్ఆర్ రైతు భరోసా పథకం తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు 1.25 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. 70 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ. 8750 కోట్లు అందజేయబోతున్నామని చెప్పారు.

ఈ మొత్తాన్ని బ్యాంకర్లు పాత బకాయిలకు జమ చేయకుండా నిబంధనలు తీసుకొస్తున్నామన్నారు. మూతబడిన చక్కెర పరిశ్రమలను తెరిచేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మొట్టప్రాంత రైతుల కోసం మొత్తంగా 200 రిగ్గులు కొనుగోలు చేయబోతున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత మిగులబోతుందో చెబుతామని చెప్పారు. వైయస్ఆర్ జలయజ్ఞం ద్వారా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వివరించారు.