నేనొక్కడినే…

26 May, 2019 - 4:21 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ: ఎన్డీయే మెజారిటీ 250 స్థానాలు దగ్గరే ఆగిపోయి ఉంటే బాగుండేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలా అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెట్టించుకుని .. మద్దతిచ్చేవాళ్లమన్నారు.

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మే 30వ తేదీన నేనొక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన వెల్లడించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల వారీగా సమీక్ష చేస్తానన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు. మద్యపానాన్ని నిషేధించాకే మళ్లీ ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ఆయన వివరించారు.

మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ అంశాన్ని నెరవేరుస్తామని ఆయన వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను శనివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగానే కలిశానన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు అవసరమని ఆయన అభిప్రాయడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.

రాష్ట్ర ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లకుండా పనులు చేస్తానన్నారు. యుద్ధప్రాతిపదికన పోలవరాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం టెండర్లలో స్కాం జరిగితే ఆ టెండర్లనే రద్దు చేస్తామని ఆయన తెలిపారు. రాజధాని భూముల్లో అతిపెద్ద స్కాం జరిగిందని ఆరోపించారు. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలిసి భూములను కొనుగోలు చేశారన్నారు.

అలా భూముల బినామీలను వదిలేసి.. రైతుల దగ్గర భూములు తీసుకున్నారని.. అలా తీసుకున్న భూములను నచ్చిన వారికి అతితక్కువ ధరకు కట్టబెట్టారని వైయస్ జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతిది పారదర్శకంగానే ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి లేకుండా చేస్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో ఏపీలో చాలా కుంభుకోణాలు జరిగాయని ఆరోపించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించానని తెలిపారు. కేంద్రం నుంచి తగిన సాయం కోరానని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాపై కూడా మోదీతో చర్చించానన్నారు. అలాగే రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉన్న విషయాన్ని సైతం మోదీకి వివరించానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉందని వైయస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రూ. 2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా ఉన్నారన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు మోదీని అడుగుతూనే ఉంటానన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కూడా మర్యాదపూర్వకంగానే కలిశామన్నారు.

కేంద్రంపై ఒత్తిడి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వైయస్ జగన్.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వారికి వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.