తూర్పులో జగన్‌కు ఘన స్వాగతం

12 June, 2018 - 5:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

రాజమండ్రి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడ వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్‌ కొవ్వూరు నుంచి బయలుదేరి రాజమండ్రి రోడ్‌ కం రైల్వే బ్రిడ్జికి చేరుకుని జిల్లాలోకి ప్రవేశించగానే వైఎస్సార్‌‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్‌‌సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రమైంది.

పార్టీ నేతలు, కార్యకర్తలు, అశేష జనవాహిని తోడురాగా వైఎస్‌ జగన్‌ ముందుకు అడుగులు వేశారు. తమ అభిమాన నేత వైఎస్‌ జగన్‌‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో రోడ్‌ కం రైల్వే బ్రిడ్జి వద్ద పండగ వాతావరణం కనిపించింది. మరోవైపు వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు తరలివస్తున్న అభిమానులను ఏవో సాకులు చెబుతూ పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. బ్రిడ్జి నుంచి పాదయాత్ర కొనసాగించిన వైఎస్‌ జగన్‌ శ్యామల థియేటర్‌ సెంటర్‌‌కు చేరుకున్నారు.మరోవైపు రోడ్‌ కం రైల్వే బ్రిడ్జిని వైఎస్సార్‌‌సీపీ జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. బ్రిడ్జి కింద గోదావరిలో ఒక వైపున పార్టీ జెండాలతో అలంకరించిన 600 పడవలు స్వాగతం పలికాయి. బ్రిడ్జికి మరోవైపున రెయిలింగ్‌‌కు ఏడు అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల మేర భారీ పార్టీ జెండా కట్టి స్వాగతం పలికారు.