‘వడ్డీలు వేయడం శోచనీయం’

18 March, 2020 - 6:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైయస్ నవోదయం కింద ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు చాలా తక్కువగా ఉన్నాయని బ్యాంకర్లతో సీఎం వైయస్ జగన్ అన్నారు. అలాగే ప్రధాని ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇచ్చే రుణాల శాతం కూడా చాలా తక్కువగా ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. స్వయం సహాయ సంఘాల రుణాలపై దృష్టి సారించాలని

బ్యాంకు అధికారులకు సీఎం జగన్ సూచించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఇస్తున్న రుణాలు అంత ఆశాజనకంగా లేవని ఆయన పేర్కొన్నారు. ఇక మహిళలకు వడ్డీరేట్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లను సీఎం జగన్ కోరారు. బ్యాంకుల వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆయన అన్నారు. 12.5, 13.5 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు ఇంతలా వడ్డీలు వేయడం శోచనీయమని జగన్ పేర్కొన్నారు.