బీజేఎల్పీ లీడర్‌గా యడ్డీ ఏకగ్రీవం!

16 May, 2018 - 12:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ బుధవారం ఉదయం శాసనసభా పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు బీఎస్‌ యడ్యూరప్పను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం యడ్యూరప్ప గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిసేందుకు రాజ్‌‌భవన్‌‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని యడ్యూరప్ప గవర్నర్‌‌ను కోరతారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అడగనున్నారు.

బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, జేపీ నడ్డా పాల్గొన్నారు. కాంగ్రెస్‌- జేడీఎస్‌ పొత్తు పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జవదేకర్‌ అన్నారు. దొడ్డిదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విమర్శించారు. వాళ్లు అనవసరమైన టెన్షన్లు సృష్టిస్తున్నారని, కర్ణాటక ప్రజలు తమతోనే ఉన్నారని జవదేకర్ పేర్కొన్నారు.