‘ఏ మంత్రం వేసావె’ రివ్యూ

09 March, 2018 - 5:46 PM

సినిమా: ఏ మంత్రం వేసావె
జానర్: థ్రిల్లర్‌
నటీనటులు: విజయ్‌ దేవరకొండ, శివానీ సింగ్‌, ఓమ్యా విరాక్‌, నీలాక్షి సింగ్‌, రాజబాబు, ఆశిష్‌ రాజ్‌, ప్రభావతి, దీపక్‌ తదితరులు.
మ్యూజిక్: అబ్దూస్‌ సమద్‌
దర్శకత్వం: శ్రీధర్‌ మర్రి
నిర్మాత: మల్కాపురం శివకుమార్‌

నటుడిగా తొలి నుంచీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’తో సరికొత్త ట్రెండ్‌‌ను సెట్‌ చేశాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఏ మంత్రం వేసావె’. పెళ్లిచూపులు కన్నా ముందే ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్‌ మీడియా, గేమింగ్‌ లాంటి వాటిలో పడి యువత ఎలా నష్టపోతున్నారు అనే కాన్సెప్ట్‌‌తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్‌ కెరీర్‌‌కు మరింత బూస్ట్‌ ఇచ్చిందా?

స్టోరీ: నిఖిల్‌ (విజయ్‌ దేవరకొండ) గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు. నెలల తరబడి తన గదిలో నుంచి బయటకు రాకుండా గేమ్స్‌ ఆడుతూ కాలం గడిపేస్తుంటాడు. తన ఫ్రెండ్స్‌‌తో ఛాలెంజ్‌ చేసి మరి ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌లో విజయం సాధిస్తుంటాడు. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి రియల్‌ లైఫ్‌‌లో గేమ్‌ ఆడదామని ఛాలెంజ్‌ చేస్తుంది.

రాగ్స్‌ (రాగమాలిక- శివాని సింగ్‌) ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్‌‌గా పని చేస్తుంటుంది. అందరూ రక్తపాతం, పోరాటం లాంటి కాన్సెప్ట్‌‌లతో గేమ్స్‌ తయారు చూస్తుంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఓ గేమ్‌ కాన్పెప్ట్‌ తీసుకు వస్తుంది, కానీ ఆమె బాస్‌ ఆ గేమ్‌ కాన్సెప్ట్‌‌ను రిజెక్ట్‌ చేస్తాడు. ఫేస్‌‌బుక్‌ స్నేహితుల ద్వారా రాగమాలికను నిఖిల్ చూస్తాడు. ఆమెతో కూడా స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. తనతో స్నేహం చేయాలంటే ఒక ఆట ఆడాలని అడుగుతుంది. కొన్ని క్లూస్‌ ఇచ్చి తన చిరునామా తెలుసుకోవాలని చెబుతుంది. మరి తన కంప్యూటర్‌ ప్రపంచాన్ని వదిలిపెట్టి రాగమాలికను వెతికేందుకు బయలుదేరిన నిఖిల్‌‌కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ ఇద్దరూ ఏ పరిస్థితుల్లో ఎక్కడ కలుసుకున్నారు? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: విజయ్‌ దేవరకొండ కెరీర్‌ తొలినాళ్లలోనే చేసిన సినిమా కావటంతో ఏ మంత్రం వేసావె సినిమాలో ఆకట్టుకునే స్థాయి పెర్ఫాన్మెన్స్‌ చూపించలేకపోయాడు. అయితే ఇతర నటీనటులతో పోలిస్తే విజయ్‌ ఒక్కడే కాస్త మంచి నటన కనబరిచినట్టు అనిపిస్తుంది. హీరోయిన్‌‌గా పరిచయం అయిన శివాని సింగ్ పూర్తిగా నిరాశపరిచింది. లుక్స్‌‌తో పరవాలేదనిపించినా నటన విషయంలో ఏ మాత్రం ఆకట్టుకోలేదు. గ్లామర్‌ పరంగా మాత్రం శివానీ సింగ్‌కు పెద్దగా మార్కులు పడవు. మిగతా తారాగణం ఆయా పాత్రలకు తగ్గట్టు నటించారు.విశ్లేషణ: కథలో కొత్తదనం ఉంది. కథనం పరంగా కూడా కసరత్తులు దర్శకుడు బాగానే చేశాడు. కానీ వాటికి తెర రూపం ఇచ్చే ప్రయత్నమే సరిగ్గా కుదరలేదు. సోషల్ మీడియా, గేమింగ్‌ లాంటివి వ్యాసనాలుగా మారి యువతను ఎలా ఇబ్బందులు పాలు చేస్తున్నయన్న ఇంట్రస్టింగ్‌ కాన్పెప్ట్‌‌ను కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యాడు. ఒకటి, రెండు ట్విస్ట్‌‌లు తప్ప సినిమాలో ఒక్క సీన్‌ కూడా ఆసక్తికరంగా తెరకెక్కించ లేకపోయాడు. చాలా సందర్భాల్లో షార్ట్‌ ఫిలింస్‌ కూడా ఇంత కంటే బాగుంటాయన్న భావన కలిగేలా సాగిందీ కథనం. కథానాయిక తెరపైకి వచ్చి ఆట మొదలుపెట్టినటి నుంచీ కథ కొంత ఆసక్తికరంగా మారుతుంది. ఆమెను వెతికే క్రమమంతా సాగదీతగా అనిపించినప్పటికీ ఆ సన్నివేశాలన్నీ ఓ గేమ్‌‌ని తలపించడంతో అది ఎక్కడ ముగుస్తుందో చూడాలనే ఆసక్తి కొనసాగుతుంటుంది.

అబ్దూస్‌ సమద్‌ అందించిన నేపథ్య సంగీతం అక్కడక్కడా మెరిసినా పాటలు మాత్రం ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ పరవాలేదు. పరిమిత వ్యయంతో తెరకెక్కిన చిత్రం కావడంతో పేరున్న నటీనటులు తెరపై కన్పించరు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:
విజయ్‌ దేవరకొండ నటన
కథ

మైనస్ పాయింట్స్:
కథా కథనం
నటీనటులు
వాణిజ్యాంశాలు లేకపోవడం
సాగదీతగా అనిపించే ద్వితీయార్థం
నిరాశపరిచే పతాక సన్నివేశాలు