‘జగన్ లాంటి సీఎం కావాలంటున్నారు’

07 November, 2019 - 6:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చిత్తూరు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా గురువారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లు గెలవడంతో.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఆమె అభివర్ణించారు. అందుకే ఆయన పాలనతో వర్షాలు లేవన్నారు.

అయితే సీఎం వైయస్ జగన్‌ది చల్లని పాదమని ఆమె అభివర్ణించారు. అందువల్లే.. ఆయన అధికారంలోకి రాగానే.. వర్షాలు వచ్చాయని రోజా చెప్పుకొచ్చారు. ఈ వర్షాల వల్ల రైతులకు, ప్రజలకు నీటి సమస్య లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వైయస్ జగన్ లాంటి సీఎం కావాంటున్నారని ఆమె తెలిపారు.

భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇసుక అందించడం కాస్త అలస్యం అయిందని.. దీనిని రాద్దాంతం చేయడం ఎంత వరకు సబబు అంటూ చంద్రబాబుని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడే తీరు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు కూల్చివేయాలంటూ ఇప్పటికే హైకోర్టు చెప్పిందని… కానీ చంద్రబాబు మాత్రం ఆ ఇంట్లోనే ఉంటున్నారని రోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.