సిద్ధ్ ‘సాంగ్స్’కి ఫిదా

14 October, 2019 - 6:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రం అల.. వైకుంఠపురంలో..  . ఈ చిత్రంలో సామజవరగమనా.. అనే ఓ పాటను ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాట విడుదలైన 15 రోజుల్లోనే 3 కోట్ల మంది వీక్షించగా.. ఆ పాటకు ఆరు లక్షల లైకులు వచ్చాయి. దీనిని బట్టే అర్థమవుతోంది. ఈ పాటకు ఎంత క్రేజీ వచ్చిందో. ఈ పాటను ఆలపించిన సిద్ద్ శ్రీరామ్ వాయిస్ యూత్‌ను సమ్మోహన పరుస్తోందనేందుకు ఇదే ఉదాహరణ. అతడి వాయిస్‌లో గుండెలోతులను తడుముతోంది… ఇంకా చెప్పాంటే బాధను తన స్వరంతో ఓదారుస్తోంది… ఇంకా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనస్సు పొరల దొంతర్లో నిద్రాణమైన పాత జ్ఞాపకాలను సైతం అతడి వాయిస్ తట్టి లేపుతోందంటే అతిశయోక్తి కాదేమో.

సిద్ధ్ శ్రీరామ్ గొంతుకలో ఏదో మ్యాజిక్ ఉందంటూ సోషల్ మీడియాలో అతడిపై నెట్‌జన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతేడాది గీతగోవిందం చిత్రం విడుదలై.. రూ. 70 కోట్ల రాబట్టిందంటే .. అందులో సిద్ధ్ శ్రీరామ్ పాత్ర కీలకమని టాలీవుడ్‌లో ఓ టాక్ ఉంది. ఈ చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలే.. అంటూ సాగే రిలికల్ సాంగ్‌ని ఈ చిత్ర టీజర్‌కు ముందే విడుదల చేశారు. దాంతో ఈ చిత్రానికి ఈ సాంగ్ ఓ హైప్ తీసుకువచ్చిందని టాలీవుడ్‌లోని పేర్కొంటారు. ఇక గీతగోవిందం హిట్‌తో డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండకు సిద్ధ్ శ్రీరామ్ పరిమినెంట్ సింగర్‌గా మారిపోయాడు. అలా ట్యాక్సివాలాలో మనసే వినదు పాటతో యూత్‌కి మరింత చేరువయ్యాడు. అలాగే డియర్ కామ్రేడ్‌లో కూడా శ్రీరామ్ సెంటిమెంట్ కొనసాగింది.

తమిళంలో వచ్చిన కడల్ చిత్రంలో గాయకుడిగా సిద్ధ్ శ్రీరామ్‌ని ఏఆర్ రెహ్మాన్ పరిచయం చేశారు. అదే కడలి పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ చిత్రంలో కూడా సిద్ధ్ శ్రీరామ్ పాటలు పాడారు. అయితే రెండో పాట పాడటానికి అతడు ఏడాది పాటు ఆగాల్సి వచ్చింది. మళ్లీ రెహ్మాన్ సంగీతం అందించిన ‘ఐ’ చిత్రంలో నువ్వంటే నాకు.. అంటూ సాగే పాటను సిద్ధ్ శ్రీరామ్‌ పాడారు. అదే సమయంలో సాహసమే శ్వాసగా చిత్రంలో వెళ్లిపోమాకే.. పాట పాడారు.

ఈ రెండు పాటలతో శ్రీరామ్‌కి మంచి గుర్తింపు రావడం ప్రారంభమైంది. 2017 వరకు తమిళ డబ్బింగ్ పాటలకే సిద్ధ్ శ్రీరామ్ పరిమితమైయ్యారు. ఆ తర్వాత నిన్నుకోరి చిత్రంలో అడిగా… అడిగా పాటతో శ్రీరామ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడి గాత్రంలోని మాధుర్యాన్ని తెలుగు ప్రజలు ఆస్వాదించడం మొదలు పెట్టారు. అలా అటు తమిళం, ఇటు తెలుగు వారికి సిద్ద్ శ్రీరామ్ మరింత దగ్గరయ్యాడు. అంతేకాదు.. అతడు సాంగ్.. సెల్ కాలర్ ట్యూన్స్ ‌గా మారిపోయాయి.

హుషార్‌ మూవీలోని ఉండిపోరాదే సాంగ్ అయితే.. ఆ సినిమా హిట్‌కి కీలకంగా మరిందనే చెప్పాలి. సిద్ధ్ శ్రీరామ్‌కి తొలి గురువు తల్లి కాగా.. కర్ణాటక సంగీతంలో  అతడు శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత యూఎస్‌లో మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశారు. ఓ సినిమాలో ఆరు పాటలు ఉంటే.. వాటిలో సిద్ధ్ శ్రీరామ్‌తో ఓ పాట పాడించి.. ఆ పాటను ముందుగా విడుదల చేయడం ప్రారంభించారు టాలీవుడ్ దర్శకులు. సిద్ధ్ శ్రీరామ్ ఆలపించిన పాటతో సినిమాకు మంచి హైప్ వస్తుందనే భావనలో టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ఉన్నారంటే సిద్ధ్ శ్రీరామ్ టాలెంట్ అర్థం చేసుకోవచ్చు.