ఇంగ్లండ్ ప్రపంచకప్‌కు విరాట్ సేన ఇదే..!

15 April, 2019 - 4:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: మే 30 నుంచి ఇంగ్లండ్‌‌ వేదికగా జరిగే వరల్డ్‌ కప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడి టీమిండియాను చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం ముంబైలో సమావేశమై జట్టును ప్రకటించింది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హాజరయ్యాడు. జట్టు కెప్టెన్‌‌గా విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌‌గా రోహిత్ శర్మ పేర్లను కమిటీ ఎంపిక చేసింది. యజువేంద్ర చాహల్‌, హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించిన జట్టు సెలక్షన్ కమిటీ అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌‌లకు మొండిచేయి చూపించింది. ఆల్‌‌రౌండర్ల స్థానంలో హార్దిక్‌ పాండ్యాతో పాటు విజయ్‌ శంకర్‌‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వన్డే వరల్డ్‌‌కప్ కోసం భారత జట్టును ప్రకటించడానికి ముందు సెలక్టర్లు సోమవారం ఉదయం సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ)తో ప్రత్యేకంగా సమావేశమైంది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలో ప్రపంచకప్‌‌లో పాల్గొనే జట్టు ఇలా ఉంది:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శ‌ర్మ (వైస్ కెప్టెన్), శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, మహేంద్ర సింగ్ ధోనీ (కీపర్), కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వర్ కుమార్‌, జ‌శ్‌‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మొహ‌మ్మద్ షమీ.

ముందుగా ఊహించినట్లే రాహుల్‌‌కు వరల్డ్‌కప్‌ భారత జట్టులో స్థానం లభించింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మిడిల్ ఆర్డర్‌‌లో ఆడటంతో పాటు మూడో ఓపెనర్‌‌గా పనికొస్తాడనే ఉద్దేశంతో రాహుల్‌కు జట్టులో సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌‌ను రెండో వికెట్‌ కీపర్‌‌గా ఎంపిక చేసింది. ఈ రేసులో రిషభ్‌ పంత్‌ ఉన్నా.. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోని అతనికి నో చెప్పడం గమనార్హం.

కొన్ని నెలలుగా ఆల్‌‌రౌండర్‌ స్థానానికి జడేజా, విజయ్‌ శంకర్‌ మధ్య పోటీ ఉంది. అయితే ఈ ఇద్దర్నీ ఎంపిక చేయడం ఊహించని పరిణామం. శంకర్‌ ఆట పట్ల సానుకూలంగా ఉన్న సెలక్టర్లు వరల్డ్‌‌కప్‌ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేయడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. విజయ్‌ శంకర్‌ స్లో మీడియం పేస్‌ బౌలింగ్‌ కారణంగా అతని వైపు కూడా సెలక్టర్లు మొగ్గుచూపారు. మరోవైపు జడేజా కచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌‌తో బ్యాట్స్‌‌మెన్‌‌ను కట్టి పడేయగల సమర్థుడు. అందువల్ల వారిపై ఒత్తిడి పెరిగి చాలాసార్లు వికెట్లు దక్కాయి. పైగా జట్టులో జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌ కూడా.

ఇక.. పంత్‌‌కు జట్టులో ఎందుకు స్థానం కల్పించలేదో మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ‘ఒకవేళ ధోనీ గాయపడితే.. పంత్‌‌ని కానీ, కార్తీక్‌‌ని కానీ జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందని అనుకున్నాం. కానీ అది ముఖ్యమైన మ్యాచ్ అయితే.. వికెట్‌ కీపింగ్ ఎంతో ముఖ్యం. అందుకే పంత్‌‌కి బదులు దినేశ్ కార్తీక్‌‌ని జట్టులోకి తీసుకున్నాం. లేకుంటే పంత్‌‌కే అవకాశం ఇచ్చే వాళ్లం’ అని తెలిపారు. టీమిండియాలో నాలుగో నంబర్‌ ఆటగాడిపైనే గత ఆరు నెలలుగా చాలా చర్చ జరిగడం విశేషం.

బ్యాట్స్‌‌మెన్‌: కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌
బౌలర్లు: బుమ్రా, షమీ, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, చాహల్‌
ఆల్‌రౌండర్లు: కేదార్ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌, రవీంద్ర జడేజా
వికెట్‌ కీపర్లు: ఎంఎస్ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌.