ప్రపంచకప్‌కు ధావన్ దూరం

19 June, 2019 - 10:38 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: ఐసీసీ ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపిస్తున్న టీమిండియాకు ఎదురుదెబ్బే తగిలింది. డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమచేతి బొటనవేలికి గాయం తగలటంతో ధావన్ ఇంగ్లండ్‌లో ఐసీసీ ప్రపంచ కప్ 2019 నుంచి వైదొలిగాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ బౌలింగ్‌లో ధావన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన ధావన్ 109 బంతుల్లో 117 పరుగులు చేశాడు. కాగా.. ధావన్ మూడు మ్యాచ్‌లకు దూరమంటూ ముందుగా వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ధావన్ స్థానంలో వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు టీమిండియాలో స్థానం లభించింది. ఈ మేరకు టీమ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

గాయం తగలడంతో ధావన్ కు మూడు మ్యాచ్‌లకు ధావన్‌కు విశ్రాంతి కల్పించారు. కానీ గాయం నుంచి ధావన్ కోలుకోలేకపోయాడు. ఇతర మ్యాచ్‌లకు కూడా ధావన్ ఆడే పరిస్థితి లేకపోవడంతో.. ప్రపంచకప్‌కు ధావన్ పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి దూరం కావడంపై ధావన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్‌ ఎంతో ఎమోషనల్‌​ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ‘బొటనవేలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నాను. ఏది ఏమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్‌’ అంటూ వీడియో షేర్‌ చేశాడు.

శిఖర్ ధావన్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మైదానంలో గబ్బర్‌ ఆడే ఆటను, చేసే హడావుడిని మిస్ అవుతామని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.