విడాకులకు వింత కారణం!

13 April, 2019 - 12:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భోపాల్: వరుసగా ఏడెనిమిది రోజులు స్నానం చేయని, షేవింగ్ చేసుకోని ఓ భర్తపై అతని భార్య విడాకులకు దరఖాస్తు చేయడం సంచలనం రేపుతోంది. శరీరం నుంచి వస్తున్న దుర్వాసనను కప్పిపుచ్చేందుకు పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాడని ఆ దరఖాస్తులో భార్య పేర్కొంది. మధ్యప్రదేశ్‌‌‌లోని భోపాల్‌‌లో ఈ ఘటన జరిగింది. మన దేశంలో వైవాహిక బంధాలు రోజురోజుకూ బలహీనం అవుతున్నాయనడానికి, చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల దాకా దంపతులు వెళుతున్న వైనం ఈ సంఘటనతో మరోమారు తెర మీదకు వచ్చింది.

భోపాల్‌‌కి సమీపంలోని బరిగఢ్‌‌కి చెందిన ఈ 23 ఏళ్ళ మహిళ.. సింధి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి గత ఏడాది కులాంతర వివాహం చేసుకుంది. వీరి పెళ్ళికి పెద్దలు అనుమతించడం గమనార్హం. అయితే.. కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. విడాకుల కోసం ఆమె చేసిన దరఖాస్తులో పేర్కొన్న కారణమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విడాకులు ఎందుకని కోర్టు ఆమెను ప్రశ్నించగా… సింధి కమ్యూనిటీకి చెందిన తన భర్త వరుసగా వారం రోజుల పాటు షేవింగ్, స్నానం చేయడంలేదని చెప్పింది. స్నానం చేయకపోవడంతో అతని నుంచి దుర్గంధం వస్తోందని.. స్నానం చేయమని చెబితే పెర్‌‌ఫ్యూమ్‌‌ కొట్టుకుని సరిపెడతాడని తెలిపింది. అలాంటి వ్యక్తితో తాను కలిసి ఉండలేనని అందుకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పింది.

ఈ వాదనలు విన్న కోర్టు భార్యాభర్తలు ఇద్దరూ ఆరు నెలల పాటు విడివిడిగా ఉండాలని ఆదేశించింది. ఆ తర్వాతే విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది.

వీరిద్దరికీ కౌన్సెలింగ్ చేసిన ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్ అవస్థి మాట్లాడుతూ.. ఆమె బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన మహిళ అని తెలిపారు. సింధి కమ్యూనిటీకి చెందిన అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందని.. చిన్న కారణంతోనే విడాకులకు దరఖాస్తు చేసుకుందని అన్నారు. ఇంట్లో వాళ్లు ఎంత వద్దని చెప్పినా ఆమె వినలేదన్నారు.

ఆధునిక ప్రపంచంలో మనుషుల మధ్య బంధాలకు విలువే లేకుండా పోయిందనడానికి ఈ సంఘటనే మరో తాజా ఉదాహరణగా నిలిచింది.