నీరవ్ మోడీ లండన్‌లో అరెస్ట్

20 March, 2019 - 5:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: భారతదేశం అతి పెద్ద దౌత్య విజయం సాధించింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఆ బ్యాంకుకు 13 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్‌‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్టే అని చెబుతున్నారు. లండన్‌‌లోని హోల్‌‌బోర్న్‌ మెట్రో స్టేషన్లో నీరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు ఆదేశాలతో వారు నీరవ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నీరవ్‌ మోడీని తమకు అప్పగించాలని ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ డైరక్టరేట్‌ మార్చి 9న లండన్‌‌లోని హోంశాఖ కార్యాలయానికి లేఖ రాసింది. భారత్‌ వినతిపై స్పందించిన వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్‌‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది

నీరవ్‌ మోడీ కొద్ది రోజుల క్రితం లండన్‌‌లో దర్శనమిచ్చాడు. నీరవ్ మోడీ వేషం మార్చి లండన్ వీధుల్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాడు. బ్రిటిష్‌ న్యూస్‌ పేపర్‌ ‘ది టెలిగ్రాఫ్‌’ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. లండన్‌‌లోని సెంటర్‌ పాయింట్‌ టవర్‌ బ్లాక్‌‌లోని మూడు పడక గదుల నివాసంలో నీరవ్‌ ఉంటున్నాడని అది తెలిపింది. దీనికి నెలకు 17వేల పౌండ్లు (రూ.15 లక్షలు) పైగా అద్దె ఉంటుందని సమాచారం. అక్కడికి దగ్గరలో ఉన్న సోహోలో నీరవ్‌ వజ్రాల వ్యాపారం చేస్తున్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది. నీరవ్‌‌కు సంబంధించి రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియోను టెలిగ్రాఫ్‌ సంస్థ కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్‌, అతని మామ మెహుల్‌ చోక్సీపై ఈడీతో పాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, ఇతర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద నీరవ్‌, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్‌ చేసింది.

చట్టపరమైన చర్యల తర్వాత నీరవ్‌ మోడీని భారత్‌‌కు అప్పగించే ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. కాగా.. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు నీరవ్ మోడీ అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.