ఆనం వర్గంపై బహిష్కరణ వేటు?

11 July, 2018 - 2:37 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం క్రాస్ రోడ్స్‌‌లో ఉన్నారు. ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయన వర్గంపై టీడీపీ వేటు వేసేందుకు రెడీ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఆనం నాలుగైదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో పది నిమిషాల పాటు జగన్‌‌తో భేటీ అయ్యారు. అప్పటి నుంచే టీడీపీ కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని టీడీపీ భావిస్తోంది.

రామనారాయణరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆనం ఇంచార్జిగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళనకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఆనంపై నేరుగా చర్యలు తీసుకోకుండా ఆయన వర్గీయులుగా ముద్రపడిన వారిని పదవుల నుంచి తప్పిస్తారని సమాచారం వస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆ దిశగా కసరత్తు ప్రారంభించారట కూడా.

ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఆయన వర్గీయులైన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కూడా దూరంగా ఉంటున్నారు. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన దళితతేజంలో వారి భాగస్వామ్యం లేదని అంటున్నారు. ఆనం పార్టీ మార్పుపై పునరాలోచన చేస్తారని ఇన్నాళ్ళూ టీడీపీ చూసీ చూడనట్లుగా వ్యవహరించిందని, ఇప్పుడు ఆయన వెళ్లడం ఖాయమని తేలిందని, అందుకే ఆయన వర్గీయులపై చర్యలకు సిద్ధమవుతోందని అంటున్నారు.

ఆత్మకూరు ఇంచార్జిగా తనను నియమించిన తర్వాత ఆనం మార్పులు చేర్పులు చేశారు. తనవారిగా ముద్రపడిన వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం టీడీపీని ఆలోచనలో పడేసింది. ఆనం పార్టీ మారితే వీరు కూడా ఆయన వెంటే నడుస్తారని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ విధేయులకు, సమర్థులకు పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలను కూడా కొత్త వారికి అప్పగించాలని చూస్తున్నారు.

కాగా.. జగన్‌‌తో రామనారాయణరెడ్డి భేటీ అయినప్పటికీ ఇంకా వైఎస్ఆర్‌సీపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇరువురి మధ్య ఏవైనా షరతుల కారణంగా ఆగిపోయిందా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆగస్టు నెలలో ఆనం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.