సోనియా చేతికే మళ్ళీ.. పగ్గాలు..?!

11 July, 2019 - 9:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: అన్ని విధాలా చతికిలపడిపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ సోనియా గాంధీయే దిక్కు కానున్నారా? అంటే.. కావచ్చేమో అనే సంకేతాలే వెలువడుతుండడం గమనార్హం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ మనసు మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో పార్టీని నడిపించగల సమర్ధుడి కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతూనే ఉంది. పార్టీలో సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా పేరు ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావన వచ్చింది. ఇంచుమించు ఆయనే శతాధిక రాజకీయ పక్షం కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు కానున్నారని భావిస్తున్న సమయంలో మళ్ళీ సోనియా గాంధీ పేరు అనూహ్యంగా తెరమీదకు వస్తోందట. అసలే ఆరోగ్యం సరిగా లేక చికిత్స చేయించుకుంటున్న సోనియాగాంధీ తాత్కాలికంగా అయినా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాల్సి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజానికి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు ఎంపికవుతారనే రేసులో అప్పుడప్పుడూ మరి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే స్పష్టత మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ పేరు తెర మీదకు రావడం విశేషం. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు సోనియాను కోరినట్లు అభిజ్ఞవర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ విషయం గురించి ఓ జాతీయ మీడియా సోనియా గాంధీని అడిగినప్పుడు ఆమె స్పందించలేదట. అయితే ఆ వార్తలను ఆమె కొట్టిపారేయకపోవడంతో కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియా చేతికి వచ్చే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పేందుకు సీనియర్‌ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదంలో ఉంది. తెలంగాణలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడాలంటే సోనియాగాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారట. ఇప్పటికే చాలా మంది సీనియర్‌ నేతలు ఈ విషయమై సోనియా గాంధీని కలిసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. ఆరోగ్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగానైనా తాను పార్టీ బాధ్యతలు నిర్వహించలేనేమో అని సోనియా తన సన్నిహిత వర్గాలకు చెప్పినట్లు తెలుస్తొది. కానీ.. పార్టీ పరిస్థితుల దృష్ట్యా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వినిపిస్తోంది. 1998లో సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. పంతొమ్మిదేళ్ల పాటు అధినేత్రిగా ఆమె సుదీర్ఘకాలం కొనసాగారు. 2017 డిసెంబరులో ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

అదే ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ సీనియర్లు ఎంత చెప్పినా రాహుల్‌ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరి అయింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించేందుకు నేతలెవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది.