ఆదాయపు పన్ను రద్దు.. బీటీటీ యోచనలో మోదీ?

11 July, 2018 - 2:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నేపత్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీయే విజయం సాధించాలంటే ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలనే ఉద్దేశంతో ఉన్న ప్రధాని మోదీ సంచలన నిర్ణయం ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీలూ బాగా పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఈ సంవత్సరం పంద్రాగస్టు రోజున ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, మోదీ తన నోటి వెంట ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోదీపై ప్రజా వ్యతిరేకతను పెంచాయి. ఆ వ్యతిరేకతను తగ్గించకపోతే గెలుపు కష్టతరం అవుతుందనే ఆలోచనలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీచేందుకు ఏం చేయాలని ఆలోచించిన కమలనాథులు ఆదాయపు పన్ను రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశ ప్రజలను సంతోషంలో ముంచెత్తడానికి సిద్ధమవుతున్న మోదీ, ఆదాయపు పన్నును రద్దు చేస్తే, గెలుపు సులువు అవుతుందని నమ్ముతున్నట్టు సమాచారం.

ప్రతి సంవత్సరమూ బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ, ఆదాయపు పన్ను పరిమితులను పెంచుతారా? లేదా? అని కోట్లాది మంది సగటు వేతన జీవులు ఎదురు చూసే విషయం తెలిసిందే. మినహాయింపులు కోరుకునే వారికి ఆదాయపు పన్నునే ఎత్తేస్తున్నారని తెలిస్తే, ఊహించని రీతిలో సానుకూల పవనాలు వీస్తాయన్నది మోదీ టీమ్ ఆలోచనగా ఉందట.

నిజానికి ఆదాయపు పన్ను రద్దు ప్రతిపాదన ఈనాటిది కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలోనే వచ్చింది. నోట్ల రద్దుతో వ్యవస్థ బాగుపడుతుందని ప్రతిపాదించిన ‘అర్థగ్రంధి’ సంస్థ అదే సమయంలోనే ఆదాయపు పన్ను రద్దు అంశాన్నీ ప్రతిపాదించింది. నగదు రహిత సమాజం విస్తరిస్తే, ఇన్‌కం టాక్స్ వసూలు అవసరం లేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఆదాయపు పన్ను రద్దును కోరారు.

ఇక ఆదాయపు పన్నును రద్దు చేసిన పక్షంలో కేంద్ర ఖజానాకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మరో ప్లాన్‌ను కూడా మోదీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే బీటీటీ (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్). అంటే.. ప్రతి బ్యాంకు లావాదేవీపైనా పన్ను పడుతుంది. డబ్బు వేసినా, తీసినా, ఆన్ లైన్‌లో ఖర్చు చేసినా, కార్డు గీకినా కొంత మొత్తం కేంద్ర ఖజానాకు చేరిపోతుంది. బీటీటీని పక్కన పెడితే ఆదాయపు పన్ను రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకుంటే, ఆయన తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రధాని నోటి వెంట పన్ను రద్దు మాట వస్తుందా? రాదా? అన్నది వేచి చూడాల్సిందే.