రోజంతా చదువే.. విడాకులిప్పించండి

31 August, 2019 - 5:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భోపాల్‌: చిన్న చిన్న విభేదాలు లేదా కారణాలతో విడాకులు తీసుకుంటున్న భార్యాభర్తల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువ అయిపోతోంది. తాజాగా చెప్పుకునేది కూడా ఇలాంటి విచిత్ర సంఘటన గురించే. ఓ భర్త నిరంతరం పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ అతని ఇల్లాలు విడాకుల కోసం కోర్టుకెక్కింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని కటారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందటే పెళ్ళయ్యింది. అయితే.. ఆ భర్త యూపీఎస్సీ పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. భార్యను పట్టించుకోవడం మానేశాడు. కనీసం భార్యతో మాట్లాడడం లేదు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆ యువతి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.

కౌన్సిలింగ్‌ సందర్భంగా ఆ యువతి.. ‘నా భర్త పీహెచ్‌డీ పూర్తిచేశాడు. నా అత్తమామలకు నా భర్త ఒక్కడే కుమారుడు. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే.. తన తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. వారి బలవంతం మేరకు పెళ్ళి చేసుకున్నాడు. వివాహం అయిన నాటి నుంచీ చదువుకే అంకితం అయ్యాడు. తనకు పెళ్ళయి భార్య ఉందనే విషయాన్ని పట్టించుకోవడం మానేశాడు. బంధువు ఇళ్ళలో ఫంక్షన్లకు వెళదామన్నా, షాపింగ్‌కు రమ్మన్నా.. కనీసం సినిమా చూసేందుకు తీసుకువెళ్ళమన్నా బయటకు రావడం లేదని ఆ భార్య తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి ఉండటం కుదరదు. అందుకే విడాకులు కోరుతున్నాను’ అని తెలిపింది. అయితే ఆ భర్త మాత్రం తన భార్య పుట్టింటికి వెళ్లిందని.. తిరిగి రావడానికి ఇష్టపడటం లేదని.. ఆమె విషయంలో తనకు ఎలాంటి ఫిర్యాదులూ లేవని.. ప్రస్తుతం ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. అందుకే.. విడాకులు మంజూరు చేయాలని అతను కూడా కోర్టును కోరాడు. యూపీఎస్సీ పరీక్ష నెగ్గడం తన చిన్నప్పటి నుంచీ ఉన్న కోరిక అని చెప్పాడు. ఆ కలను నెరవేర్చుకునేందుకే తన పూర్తి సమయాన్ని వెచ్చించి ప్రిపేరవుతున్నానని అన్నాడు.

ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీని గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మేం వారి వివాహ బంధాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. మరో నాలుగు సెషన్ల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. ఆ తర్వాత కూడా విడిపోవాలనే వారు నిర్ణయించుకుంటే అప్పుడు వారికి విడాకులు మంజూరు చేస్తాం’ అని తెలిపారు.

పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయమవుతాయంటారు.. అయితే.. వాటిని కలకాలం నిలుపుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే కదా ఉంది!