కూతురి వైద్యానికి డబ్బడితే.. తలాక్!

07 January, 2018 - 3:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో : ముమ్మారు తలాక్‌‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే దేశంలో యధేచ్ఛగా ఈ వ్యవహారం జరిగిపోతూనే ఉంది. వివాహ హక్కుల రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో కూడా అలాంటి కేసులు ఇంకా ఎక్కువగా నమోదు అవుతుండటం గమనార్హం.

ఉత్తర ప్రదేశ్‌‌లో శనివారం ఒక్క రోజే రెండు ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. గోండా ప్రాంతంలో ఓ మహిళ తనను తన భర్త ముమ్మారు తలాక్‌ చెప్పి వెళ్లగొట్టాడని మీడియా ముందు వాపోయింది. వికలాంగురాలైన కూతురికి చికిత్స చేయించేందుకు డబ్బులు అడిగిన పాపానికి తన భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని ఆమె విలపించింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె మత పెద్దలు, పోలీసులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు.మరో ఘటనలో.. దుబాయ్‌‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు ఫోన్‌‌ సందేశం ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. సుల్తాన్‌‌పూర్‌‌కు చెందిన రుబినా బానోకు, హఫీజ్‌ ఖాన్‌‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యూఏఈలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె అత్తవారింట్లో ఉంటోంది. గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటివారు భానోను వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రుబినా ఫోన్‌‌కు హఫీజ్‌ ట్రిపుల్‌ తలాక్‌ సందేశం పంపటంతో ఆమె షాక్‌ తింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే భర్త తనకు విడాకులిచ్చి ఉంటాడని ఆమె భావిస్తోంది.

గత రెండు నెలల్లో యూపీలో ట్రిపుల్‌ తలాక్‌ కేసులు 30 దాకా నమోదు కావటం గమనార్హం. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం ‘ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్’ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అది ఏ రూపంలో(ఫోన్‌ సందేశం, సోషల్‌ మీడియా ద్వారా అయినా) ఉన్నా సరే నేరమే. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. లోక్‌‌సభలో బిల్లుకు క్లియరెన్స్‌ లభించగా.. రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది.