కృత్రిమంగా పెట్రో ధరల పెంపు

11 June, 2018 - 2:04 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరం నిప్పులు చెరిగారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆయన విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మండిపడ్డారు. దేశంలో చిన్నతరహా పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూతపడ్డాయని తమిళనాడు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలను ఎన్డీయే ప్రభుత్వం కృత్రిమంగా పెంచడంపై దేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని చిదంబరం అన్నారు. 2014 మే-జూన్‌ నాటితో పోల్చుకుంటే ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతో పెరిగిపోయాయని, ఇంతగా ధరలు పెరగడానికి ఎలాంటి సరైన కారణమూ కనిపించడం లేదని ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. పెట్రోల్‌ ధరలు పెరిగిపోయి సామాన్యుల పరిస్థితి దీనంగా మారిపోయిందని చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు.

మోదీ హయాంలో పెట్టుబడులు రావడం లేదని, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని, మార్కెట్‌‌పై ప్రభుత్వానికి నియంత్రణ లేదని చిదంబరం విమర్శించారు. 50వేల చిన్న కంపెనీలను మూసేశారని, ఇదేనా అభివృద్ధి అని కేంద్రాన్ని చిదంబరం ప్రశ్నించారు. నోట్ల రద్దు వల్ల దేశంలో వ్యాపారులు దెబ్బతిన్నారని అన్నారు. కరెన్సీ నోట్లు కలిగి ఉండటం ప్రజల హక్కు అని, దానిని ప్రభుత్వం దూరం చేయకూడదని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేకుండా చేశారని చిదంబరం నిప్పులు చెరిగారు.