ద.మ.రైల్వే పరిధి అన్ని స్టేషన్లలో వైఫై

18 July, 2019 - 8:59 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ వచ్చే 100 రోజుల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ విషయం దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 753 స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 207 స్టేషన్లలో మాత్రమే వైఫై అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. ఏ 1, ఏ కేటగిరీల్లోని 36 పెద్ద స్టేషన్లతో పాటు 171 చిన్న స్టేషన్లలో ప్రయాణికులకు వైఫై సౌకర్యాన్ని దగ్గర చేశామని, మరో 76 స్టేషన్లలో వైఫై పరికరాల ఏర్పాటు పూర్తయిందని ఆయన వివరించారు. ‘రైల్‌ వైర్‌’ పేరుతో అందిస్తున్న ఈ సేవలను వంద రోజుల్లో అన్ని స్టేషన్లకూ విస్తరిస్తామని గజానన్ తెలిపారు. గడచిన మే నెలలో 10 లక్షల మంది ప్రయాణికులు స్టేషన్లలో వైఫై వినియోగించుకున్నారని, హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, గుంతకల్‌ స్టేషన్లలో ఈ వినియోగం అధికంగా ఉందని చెప్పారు.