ఎమ్మెల్యే రోజా సైడైపోతున్నారా…?

13 September, 2017 - 8:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందుకు కూడా టీడీపీపైన, సీఎం చంద్రబాబుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రోజా ఇటీవలి కాలంలో మీడియాలో మరీ నల్లపూస అయిపోవడం చర్చనీయాంశం అవుతోంది.

రోజా ఇలా సైలెంట్ అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే కారణం అని వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ ఆమెను సైలెంట్‌‌గా ఉండమన్నారా? లేక ఆమెనే సైడైపోయి, సైలెంట్ అయిపోతున్నారా? అనే సందేహం కూడా కలుగుతోంది. ఆయా ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన అసందర్భ వ్యాఖ్యలే కారణమని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

ప్రచారంలో రోజా అభ్యంతరకర పదాలు వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ డ్రెస్ కోడ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలూ ఓటర్లను ఒకింత ఆలోచింప చేశాయనే అభిప్రాయం పార్టీ నేతల్లో కలిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత కాలం పాటు సెలెంట్‌‌గా ఉండాలని రోజాకు పార్టీ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం రోజా తన నియోజకవర్గం నగరిపైనే దృష్టి కేంద్రీస్తున్నారట. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ప్రజల మధ్యనే ఆమె ఎక్కువగా గడుపుతున్నారట.

మరో పక్కన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వైపు కూడా రోజా చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో రోజా కాస్త నోటీ దురుసు, దూకుడు తగ్గించి, జాగ్రత్తగా ఉంటున్నారేమో అనే విశ్లేషణలూ వస్తున్నాయి.