అన్నం పెట్టే చేతులకు సంకెళ్లా?!

13 May, 2017 - 8:18 PM

రైతు లోకం నివ్వెరపోయింది. రైతే రాజంటూ ఆశల పల్లకిలో ఊరేగిస్తున్న ప్రభుత్వమే అన్నదాతను ఘోరంగా అవమానించింది. మిర్చి పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న ఆక్రోశంతో నిరసన గళం విప్పిన ఖమ్మం రైతులకు పోలీసులు బేడీలు వేసి నడిపించిన ఘటన రైతులనే కాదు.. యావత్ సమాజాన్నీ విస్మయపర్చింది.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల ఉదాసీనత, పోలీసుల కండకావరం… కారణమేదైనా రైతుకు దక్కింది అవమానమే. దళారుల మోసాలు, వారికి వంత పాడే మార్కెట్ యార్డు అధికారులపై ఆగ్రహంతో కొందరు రైతులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి కొంత విధ్వంసానికి పాల్పడిన మాట వాస్తవమే. దానికి రాజకీయ రంగు పులిమి వారిపై రాజద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టించిన ప్రభుత్వ పెద్దలను సంత‌ృప్తి పర్చడానికే కింది స్థాయి పోలీసులు ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారంటే ఎవరైనా ఎలా కాదనగలరు? చేతులకు బేడీలు వేసి, గొలుసులతో కట్టేసి రైతులను కోర్టుకు తరలించిన తీరు సామాన్య ప్రజలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈ సంఘటనను కేవలం కడుపు మండిన ఖమ్మం జిల్లా మిర్చి రైతు దుస్థితిగా పరిగణించలేం. ఇది రాష్ట్రంలోని సగటు రైతు నిస్సహాయ స్థితికి దర్పణం పట్టే సంఘటన. ఎంతమాత్రం గిట్టుబాటు కాని వ్యవసాయంతో బతుకు బండిని ఈడ్చలేక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న కర్షకుడి దీన గాథ ఇది.

గత ఏడాది లభించిన అధిక ధరను దృష్టిలో పెట్టుకుని రైతులు ఈసారి మిర్చి, పసుపు, కంది పంటలను అధికంగా వేశారు. వాతావరణం కూడా సహకరించడంతో అధిక దిగుబడులనూ సాధించారు. పర్యవసానంగా ఈ మూడు పంటల ధరలూ గతేడాదితో పోల్చితే సగానికి పడిపోయాయి. గత సంవత్సరం 12 వేల రూపాయలకు పైన అమ్మిన క్వింటాలు మిర్చి ధర ఈసారి నాలుగు వేల దిగువకు పడిపోయింది. పసుపు, కంది పంటల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఈ స్థితిలో దిక్కుతోచని రైతు అయికాడికి అమ్ముకోవడానికి సిద్ధమైనా కొనే నాథుడు కరువయ్యాడు. పరిస్థితిని ఆసరాగా చేసుకొని మూడు వేల కన్నా తక్కువ ధరకు కొనడానికి మాత్రమే ఖమ్మం మార్కెట్‌లో మిర్చి వ్యాపారులు ప్రయత్నించారు. వారికి మార్కెట్ యార్డ్ అధికారులూ సహకరించడంతో రైతులు ఆగ్రహించారు.

ఆఫీసుపై దాడి చేసి విధ్వంసానికి దిగారు. ఇది రైతుల నుంచి స్వతహాగా వచ్చిన స్పందన కాదని, టీడీపీ రెచ్చగొట్టి దాడి చేయించిందని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదలుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దాకా పాలక ప్రముఖులు విమర్శలు చేశారు. రైతులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టించారు. దీనితో సహజంగానే కింది స్థాయి పోలీసులు సైతం రెచ్చిపోయారు. ఉగ్రవాదుల మాదిరిగా, తీవ్రవాదుల మాదిరిగా, దోపిడీ దొంగల మాదిరిగా రైతులకు బేడీలు వేసే అకృత్యానికి పాల్పడ్డారు. ఏ కేసులోనైనా మెజిస్ట్రేట్ నుంచి ప్రత్యేకమైన ఉత్తర్వులు ఉంటే తప్ప నిందితులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించేటప్పుడు బేడీలు వేయకూడదన్నది సుప్రీంకోర్టు ఆదేశం. ఈ మార్గదర్శకాలను ఖమ్మం పోలీసులు కాలరాశారు.

రైతు సమాజాన్ని కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న పాలకుల విధానాల పుణ్యమా అని సేద్యం ఎప్పటికీ గిట్టుబాటు కాని వృత్తిగానే మారిపోయింది. ఒక దిక్కూ, దిశా లేకుండా సాగిపోతున్న వ్యవసాయం ఏటా వేలాది మంది రైతులను బలిగొంటూనే ఉన్నది. కేవలం ఎన్నికలు దగ్గర పడినప్పుడు మాత్రమే పాలక పక్షాలు గానీ, ప్రతిపక్షాలు గానీ రైతు సంక్షేమం గురించి, వ్యవసాయం గురించీ ఆలోచిస్తున్నాయి. రైతుల రుణాల మాఫీ హామీతో ముందుకు వెళ్ళిన పార్టీలే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భాలను ఇటీవలి కాలంలో మనం అనేకం చూశాం.

1999 నుంచి 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన తెలుగుదేశాధినేత ఎన్. చంద్రబాబునాయుడు వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దానికి తోడు రైతుల రుణమాఫీ హామీతో ముందుకొచ్చిన వై.ఎస్. రాజశేఖరరెడ్డి 2004లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టారు. 2014లో మళ్ళీ ‘రుణ మాఫీ అస్త్రం’తోనే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగలిగారు. తెలంగాణలో కె. చంద్రశేఖరరావు కూడా అదే అస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వ్యక్తి కావడం ఒక ఎత్తయితే ఆయన విజయానికి అంతే పాళ్ళలో తోడ్పడిన అంశం రైతు రుణమాఫీయే. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయానికి దోహదం చేసిందీ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్న హామీయే.

వ్యవసాయ రంగాన్ని సమూలంగా మార్చి దాన్నొక గిట్టుబాటయ్యే వృత్తిగా రూపొందించడానికి ఏ ప్రభుత్వమూ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. విపరీతంగా పెరిగిపోయిన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే వ్యూహాలపై దృష్టి పెట్టలేదు. పంటలను క్రమబద్ధం చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించే యత్నమూ జరుగలేదు. విత్తనాల అందుబాటు నుంచి ఎరువుల సరఫరా, క్రిమిసంహారకాల వాడకం, చివరగా మార్కెట్‌లో కనీస గిట్టుబాటు ధర కల్పించడం వరూ దేనిపైనా శాస్త్రీయ దృక్పథం లేదు. ఈ ఏడాది ఒక పంటకు అధిక ధర లభిస్తే వచ్చే ఏడాది రైతులంతా అదే పంట వేసి, ఉత్పత్తి పెరిగిపోయి గిట్టుబాటు ధర లభించక నష్టపోయే పరిస్థితి ఈ నాటిది కాదు. రైతులకు తక్కువ వడ్డీకి లభించే బ్యాంకు రుణాలు అందించడంలోనూ, పాలకులది వైఫల్యమే.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా సేద్యపు నీటి ప్రాజెక్టులపై విధానాలు మారడం ఆనవాయితీ అయిపోయింది. అందుబాటులో ఉన్న పరిమితమైన ఆర్థిక వనరులతో గరిష్ఠ ప్రయోజనం సాధించే విధంగా నిర్దిష్ట కాలపరిమితిలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ పోవడం శ్రేయస్కరం. కానీ పాలకుల విధానాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రీ డిజైనింగ్ పేరుతో మళ్ళీ మొదటికి తెచ్చి అనవసరమైన జాప్యానికి కారకులవుతున్నారు.

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయటం తమ లక్ష్యమంటూ సేద్యానికి పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి రెండు పంటలకూ కలిపి 8 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే ఆర్భాటంగా ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలవుతుంది. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా రైతు సంఘాలు, సమాఖ్యలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘పంట కాలనీలు’ ఏర్పాటు చేసి ఏ పంట ఎంత వేయాలో రైతులే నిర్ణయించుకోవడానికి వీలు కల్పిస్తామన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మార్కెట్‌లో అవస్థలు పడుతున్న మిర్చి, కంది, పసుపు రైతులను ఆదుకోవడానికి ఒక కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చలేకపోతున్నది.

గత వారంలో నిజామాబాద్ మార్కెట్‌లో ఓ పసుపు రైతు పంట కుప్ప మీదే తుదిశ్వాస విడిచాడు. ఇటువంటి సంఘటనలు, ఖమ్మంలో జరిగినటువంటి ఘటనలు పునరావ‌ృతం కాకుండా చర్యలు తీసుకోలేకపోతున్నది. మిర్చి పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మరింత బోనస్‌గా కలిపి మార్క్‌ఫెడ్ వంటి సంస్థల ద్వారా కొనుగోలు చేయించడంలో ఘోరంగా విఫలమవుతున్నది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో మార్కెట్లలో పేరుకుపోయిన లక్షలాది బస్తాల మిర్చి, పసుపు పంటలను కొనుగోలు చేయడానికి చిత్తశుద్ధితో కదలవలసి ఉంది. లేని పక్షంలో రైతులు మరింత నష్టపోయే పరిస్థితి నెలకొంటుంది.

రైతు నిలదొక్కుకోవాలంటే, సేద్యం లాభసాటి కాకపోయినా కనీసం గిట్టుబాటయ్యే వృత్తిగా కొనసాగాలన్నా సమగ్రమైన వ్యూహం అవసరం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) లెక్కల ప్రకారం తెలంగాణలో 2014లో 898 మంది, 2015లో 1358 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఈ పరిస్థితి మారాలంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక పటిష్టమైన వ్యూహంతో ముందుక కదలాలి. 2006లో ప్రొఫెసర్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను, అంతకు ముందు 2004లో రైతుల ఆత్మహత్యలపై జయతీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిను సమగ్రంగా అధ్యయనం చేసి వాటి సిఫార్సులను అమలు చేయాలి.

బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావాలంటే రైతు పరిస్థితి బాగుపడాలి. వ్యవసాయం ఓ పండగ కావాలి.

– వై. నరేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్