ముఖం చాటేసిన కేటీఆర్..?

11 February, 2019 - 4:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). ఇంతకు ముందాయన మంత్రిగా చక్కని ప్రతిభ కనబర్చారు కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండోసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అయితే.. ఈ సారి కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారా చేసి రెండు నెలలు పూర్తవుతున్నా ఆయన కేబినెట్లో మరో మంత్రి మహమూద్ ఆలీ మాత్రమే ఉన్నారు. గరిష్టంగా మరో 16 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా ఇంతవరకూ కేబినెట్‌ను విస్తరించలేదు.

అయితే.. కేంద్ర రాజకీయాలపై నజర్ పెట్టిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు టీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏం చేయాలి? పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. సమీక్షిస్తూ.. నాయకులు, శ్రేణులను ఉత్సాహపరచాలి. వారందరినీ ఒక్కతాటిపై నడిపించాలి. పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉండాలి. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. అధ్యక్షుడు అప్పగించిన పనుల్ని అమలు చేయాలి.

కానీ.. కేటీఆర్ కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడడమే మానేశారట. కార్యాలయానికి వచ్చే శ్రేణులపై శీతకన్నేశారేమో? అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఇంకో పక్కన కేటీఆర్‌ను తాజా మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్కన పార్టీ కార్యకలాపాలకు మాత్రమే ఆయనను కేసీఆర్ పరిమితం చేస్తారను ఫీలర్లూ వస్తుండడం గమనార్హం. మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన తనకు ఈ సారి బెర్త్ దొరక్కపోవచ్చనే నేపథ్యంలోనే కేటీఆర్ పార్టీ ఆఫీసుకు రావడం లేదా? అంటే అలాంటిదేమీ లేదనే సమాధానాలే పార్టీ నాయకుల నుంచి వస్తుండడం గమనార్హం.తెలంగాణ భవన్‌కు కేటీఆర్ మరెందుకు రావడంలేదనే విషయం తెలిస్తే.. ఆశ్చర్యపోక తప్పదు.. ఒకవైపున మంత్రి పదవులు, మరోవైపు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లు, నామినేటెడ్‌ పోస్టులు.. ఇలా రకరకాల పదవులు టీఆర్ఎస్ పార్టీ నేతలను ఊరిస్తూనే ఉన్నాయి. ఒక పక్కన పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ చల్లని దీవెనల కోసం తపిస్తున్న నేతలంతా సమయం ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తున్నారు. కేసీఆర్ కేబినెట్లోకి గరిష్టంగా 16 మందిని తీసుకునే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ స్థానాలు 16 వరకూ ఖాళీ అవుతాయి. లోక్‌‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలో దింపే అభ్యర్థుల్నీ ఎంపిక చేయాల్సి ఉంది. మరో పక్కన పెద్ద ఎత్తున నామినేటెడ్‌ పోస్టులు కూడా పార్టీ శ్రేణుల్ని ఊరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకటికి రెండుసార్లు కేసీఆర్‌ను కలిసే అవకాశం దొరకని వారంతా ఇప్పుడు కేటీఆర్ ప్రసన్నత కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇలా ఎడతెరిపి లేకుండా వస్తున్న ఆశావహులను కొద్ది రోజుల క్రితం వరకూ సర్ది చెప్పి పంపిన కేటీఆర్‌పై ఆ వత్తిడి మరింత పెరిగిపోయింది. తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వచ్చిందే ఆలస్యం అన్నట్లుగా వారంతా క్యూ కట్టేస్తున్నారట.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌‌గా నియమితుడైన తర్వాత కేటీఆర్‌ మధ్యలో ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప ప్రతినిత్యమూ తెలంగాణ భవన్‌‌కు వచ్చారు. ఆశావహుల తాకిడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం వల్లే కేటీఆర్‌ పార్టీ నేతలకు కొద్ది రోజులుగా అందుబాటులో ఉండడం లేదనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న తెలంగాణ భవన్‌‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేటీఆర్ తెలంగాణ భవన్‌‌ను కన్నెత్తి చూడలేదు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల పంపిణీ పూర్తయ్యే దాకా ఆయన తెలంగాణ భవన్‌కు రాకపోవచ్చన్నది కొందరు నాయకుల నుంచి వస్తున్న అభిప్రాయం.