అందుకే మోత్కుపల్లిని వదిలేశారా?

03 June, 2018 - 5:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మోత్కుపల్లి నర్సింహులు… తెలంగాణ టీడీపీలో అత్యంత సీనియర్ నాయకుడు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో ఉస్మానియా నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్ బతికున్నంత వరకూ ఆయన వెంటే ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు వద్దకు వచ్చి చేరారు. బాబు కూడా ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో.. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అంతేకాదు… టీడీపీకీ ఆయన వీర విధేయుడిగా ఉంటారనే టాక్ ఉంది. ఎంతగా అంటే… తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో టీడీపీని టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన టీడీపీ నేతలపై ఈగ కూడా వాలనీయకుండా కారు పార్టీ నేతలపై మూడో కాలిపై లేచారనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి మోత్కుపల్లిని చంద్రబాబు ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు అనే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది.

రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ రావడం.. కేసీఆర్‌‌ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టడం.. ఆ తర్వాత ప్రతిపక్ష టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీల కీలక నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కారు ఎక్కించుకున్నారు. దీంతో ముఖ్యంగా టీడీపీకి దెబ్బ పడింది. అలాగే ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌‌గా దొరికిపోవడం… అదే సమయంలో ‘మనవాళ్ళు బ్రీఫ్‌‌డ్ మీ’ అంటూ చంద్రబాబు టెలిఫోన్ సంభాషణ అని మీడియాలో వైరల్ అయింది. దీంతో సైకిల్ పార్టీకి మరింత దెబ్బ తగిలింది.

టీడీపీని వదిలి… కారు ఎక్కిన వారి కంటే.. ఓటుకు నోటు కేసులో రేవంత్ దొరికిపోయి.. పార్టీ పరువు తీశారంటూ మీడియాకెక్కాడు మోత్కుపల్లి. అంతే కాకుండా సైకిల్ పార్టీలో లీడర్లు కరవయ్యారు. అదీకాక తెలంగాణలో కారుతో… సైకిల్ పోటీ పడలేదని నేపథ్యంలో ఆ పార్టీని కారు పార్టీలో కలిపేస్తే మంచిదంటూ చంద్రబాబుకు చెవిలో చెప్పకుండా… మీడియాకు ఎక్కి మోత్కుపల్లి రచ్చ రచ్చ చేశారు.

ఈ వ్యాఖ్యలతో చంద్రబాబుకు మోత్కుపల్లిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా మోత్కుపల్లికి గట్టిగా అక్షింతలు వేశారు. ఒకానొక దశలో అయితే కారు పార్టీలో.. సైకిల్ పార్టీ వీలినం నిజమే అనే టాక్ తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కూడా అయింది.

ఆ తర్వాత ఎన్టీఆర్ భవన్‌‌లో టీటీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ విలీనం వద్దంటే వద్దంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముందు ముక్తకంఠంతో నినదించారు. మీరలా చేస్తే… తాము ఆత్మాహుతికి సిద్ధమంటూ వారు అక్కడే ప్రకటించారు. ఒకానొక దశలో చంద్రబాబు వారందరికీ సర్దిచెప్పేందుకు సతమతమైపోయారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

దీంతో మోత్కుపల్లికి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఆ దూరం మరింతగా పెరిగింది. అది ఎంత వరకూ వచ్చిందంటే… ఇటీవల హైదరాబాద్‌‌లో తెలంగాణ టీడీపీ మహానాడు భారీ ఎత్తున జరిగింది. ఈ సభకు రావాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని తమ్ముళ్లందరికీ ఆహ్వానం అందింది. అంతా హాజరయ్యారు. కానీ మోత్కుపల్లికి మాత్రం ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన పబ్లిగ్గానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మే 28 టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి అంజలి ఘటించారు. ఆ తర్వాత చంద్రబాబుపై మీడియా సాక్షిగా నిప్పులు చెరిగారు.

ఇంకా చెప్పాలంటే.. ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్ర చేశారని.. అలాగే చంద్రబాబు దొరకని దొంగ అని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా 2014లో మోత్కుపల్లి… గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నుంచి కాకుండా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాలంటూ మోత్కుపల్లిని చంద్రబాబు కోరారు. అందుకు ఆయన ససేమిరా అన్నారట. ఒకవేళ మీరు ఓడినా కేంద్రంలో మిత్రపక్షం బీజేపీ.. ఆంధ్రలో టీడీపీనే వస్తోంది. కాబట్టి మీ చిరకాల కోరిక గవర్నర్ పదవి ఇప్పిస్తాను అని మరీ మోత్కుపల్లిని బాబు బుజ్జగించారు. దీంతో ఆయన ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి పాలైనా.. బాబు చెప్పిన గవర్నర్ పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ఆ తర్వాత అడపా దడపా చంద్రబాబును కలసి నా విషయం ఏం చేశారంటూ మోత్కుపల్లి అడిగే వారట. అందుకు చూద్దాం చేద్దామంటూ బాబు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. ఇంతలోనే నాలుగేళ్లు గడిచిపోయాయి. అనంతరం బీజేపీ నుంచి టీడీపీ బైటకు రావడం ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నాయి. దీంతో తాదూర కంత లేదు, మెడకో డోలా అన్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారైంది. ఇక మోత్కుపల్లికి ఏం చేస్తాం అనే నైరాశ్యంలో బాబు ఉన్నారంటున్నారు. ఆ క్రమంలోనే మోత్కుపల్లిని బాబు పక్కన పెట్టారనే టాక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.