మహాకూటమిలో ‘ముఖ్యమంత్రి’ ఎవరు?

06 December, 2018 - 7:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరి చూపులు ఫలితాల వైపే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ గల్లంతు అవుతోందని.. మహాకూటమిలో అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపిన కాంగ్రెస్ పార్టీకే ప్రజల పట్టం కడతారని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు…. సీఎం అభ్యర్థి ఎవరంటూ హస్తినలోని హస్తం పార్టీ అధిష్ఠానం వద్ద కోటరీపై ఒత్తిడి తీసుకు వచ్చి మరీ ఆరా తీస్తున్నారు.

అయితే గాంధీభవన్‌లో మాత్రం ఈ అంశంపై రసవత్తర చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2014లోనే తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం చూసుకుంటే… ఆ పార్టీలో సీనియర్ నాయకుడు, నిగర్వి, సౌమ్యుడు, రైతులతో మంచి స్నేహభావం కలిగిన వాడు, నియోజకర్గ ప్రజలతో మమేకం అయిన నేత, వివాద రహితుడు మల్లు భట్టి విక్రమార్క. ఆయనకు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ వద్ద మంచి పలుకు బడి ఉంది.

కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించడం కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి విడిపించడం కోసం తీవ్ర ప్రయత్నం చేసిన వ్యక్తి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అనే సందేహం ఆ పార్టీ గూడు కట్టుకుంది.

ఉత్తమ్‌కు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఆయన గతంలో ఎమ్మెల్యేగానే కాదు.. మంత్రిగా కూడా పని చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఆయన చెప్పిన మాటను అధిష్ఠానం వేద వాక్కులా భావిస్తుందన్నది అందరికి తెలిసిందే. ఆ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం … ఓ ఫ్యామిలీ నుంచి  ఒక్కరికి మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్ అని కండిషన్ పెట్టి మరీ చెప్పింది.

ఆ క్రమంలో సబితాకు టిక్కెట్ ఇచ్చిన  పార్టీ ఆమె తనయుడు కార్తీక్ రెడ్డికి సైతం మరో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ ఉత్తమ్ కుమార్ మాత్రం తన ఇంట్లో రెండు ఎమ్మెల్యే టిక్కెట్లను ఇప్పించుకున్నారు. ఒకటి హుజుర్ నగర్ నుంచి ఆయన ఎన్నికల బరిలోకి దిగితే… రెండోది ఆయన భార్యా పద్మావతి రెడ్డి కోదాడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

దీనిని బట్టే అర్థమవుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఎలా ప్రసన్నం చేసుకుంటే పని అవుతుందో అలా అనుష్టానం చేయగల నేర్పు ఉన్న నేత ఉత్తమ్. అదీకాక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే కాదు… హస్తినలోని ఆ పార్టీ సీనియర్లకి ఉత్తమ్ బాగా క్లోజ్ కూడా.

ఇక మిగిలింది.. కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. హస్తం పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా పార్టీలోకి వచ్చి.. అలా లైమ్‌లైట్ అయిన తెలంగాణ నేత రేవంత్ రెడ్డి తప్ప  ఇంకెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదేమో.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్‌ చేసి.. తెలంగాణ సమాజంలోకి అత్యంత వేగంగా దూసుకువెళ్లిన నేత రేవంత్. అంతేకాదు..  కేసీఆర్ ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా చేయగల వాడి వేడి ఉన్న ఒకే ఒక్క నేత రేవంత్ రెడ్డి.

అందుకే కేసీఆర్‌కి కొండగల్‌లో సభ ఉంటే.. రేవంత్‌ను వేళగాని వేళల్లో అర్ధంతరంగా పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. దీంతో ఈ అంశం ఓ విధంగా రచ్చ రచ్చ అయిందనే చెప్పాలి…. అదీ ఎంతగా అయిందంటే తెలంగాణ ఎన్నికల సంఘమే కాదు… హైకోర్టుతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సైతం దీనిపై  స్పందించారు. దీంతో రేవంత్ రెడ్డి విడుదల కాక తప్పలేదు.

దీంతోనే రేవంత్ నసగాడు కాదు.. పస ఉన్న నేత.. కేసీఆర్ ఫ్యామిలీకి పట్టపగలే చుక్కలు చూపించగల నేత అని తెలంగాణలోని ప్రతి ఒక్కరికి బాగా అర్థమైంది. అదీకాక… రేవంత్ రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ జైపాల్ రెడ్డికి వరసకు అల్లుడు అవుతాడు.

ఈ విషయం అతి కొద్ది మందికే తెలుసు. కానీ జైపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య చాలా కాలంగా మాటలు లేవు. కానీ రేవంత్‌ని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేయడంతో వారి మధ్య బంధం మళ్లీ చిగురించిందనే చెప్పాలి. సీఎం రేసులో రేవంత్ ఉంటే.. కాంగ్రెస్ అధిష్టానం వద్ద జైపాల్ రెడ్డికి ఉన్న పలుకు బడి బాగానే ఉపయోగపడుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దీంతో రానున్న ఎన్నికల్లో సర్వే చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిస్తే మాత్రం వీరి ముగ్గురులో ఎవరో ఒకరు సీఎం అవటం మాత్రం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ రేవంత్‌కే అధిక ఛాన్సులు ఉన్నాయనేది మాత్రం సర్వత్రా వినిపిస్తున్న టాక్ అని వారు వెల్లడిస్తున్నారు.