ఎబోలా వైరస్ ఎమర్జెన్సీ

19 July, 2019 - 9:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూయార్క్‌: కాంగోలో ఎబోలా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రపంచ వ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎబోలా వైరస్‌ కాంగోలోని గోమాకు విస్తరించిందని కాంగో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించడంతో డబ్ల్యూహెచ్‌ఒ ఈ ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేషన్స్‌ ఎమర్జెన్సీ కమిటీ జరిపిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది ఎబోలా వైరస్‌ మూడు సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచీ ఇప్పటి వరకూ 1,600 మంది ఎబోలాకు బలైపోయారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ ప్రమాదకర వైరస్‌ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు.