మళ్లెప్పుడొస్తారు?.. గురువుగారూ..!

30 May, 2018 - 4:05 PM

ర్శకరత్న గారూ.. మీరు వెండితెరను ఒంటరిని చేసి వెళ్లిపోయి నేటికి ఏడాది అయింది. ఈ మూడు వందల అరవై ఐదు రోజులూ మాకు మూడు యుగాలుగా గడిచింది. టాలీవుడ్ గాడ్ ఫాదర్ అయిన మీరు లేని ఈ తెలుగు చిత్ర పరిశ్రమ ఇంటి పెద్ద లేని ఓ కుటుంబంలా దీనంగా చూస్తోంది. నటీనటులే కాదు ఇరవై నాలుగు విభాగాల కళాకారులూ తండ్రి లేని బిడ్డలుగా మిగిలిపోయారు. మీ గురుతులను నెమరువేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నూట యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తిరుగులేని చరిత్ర సృష్టించిన మీరు ఒక ‘సర్దారు పాపారాయుడు’, ఒక ‘బొబ్బిలి పులి’ కాక మరేంటి గురువు గారూ. యాభైకి పైగా చలనచిత్రాలను స్వయంగా నిర్మించేందుకు మీరు ‘మేస్త్రీ’లా ఎలా పరిశ్రమించారో మేమంతా ప్రత్యక్షంగా చూశాం. మీ నుంచి స్ఫూర్తి పొందాం. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, మాటలు, పాటల రచయితగా చిత్ర పరిశ్రమలో దాదాపు నలభై ఏళ్లు ‘బహుదూరపు బాటసారిలా’ మీరు సాగించిన ప్రయాణం అనితర సాధ్యం. మీరు మాత్రమే సాధించగలిగిన ఈ ఘనతకు గుర్తుగా మీ పుట్టిన రోజును ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించామండి. ఈ విషయం స్వర్గంలో ఉన్న మీకు ‘మేఘ సందేశం’ ద్వారా అందే ఉంటుందని భావిస్తున్నాం.

నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన మీరు ‘జీవితమే ఒక నాటకం’ అని అనుభవపూర్వకంగా సెలవిచ్చారు. మా మధ్యలో ఉన్నంత కాలం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మిమ్మల్ని మేము ఒక ‘భోళా శంకరుడు’గా నిండు మనసుతో అర్థం చేసుకున్నాం. చిత్ర సీమలో ఏదైనా వివాదం తలెత్తినప్పుడు పెద్దరికంతో మీరిచ్చిన తీర్పులు ‘జస్టిస్ చౌదరి’కి ఏమాత్రం తీసిపోవు. ‘మనుషులంతా ఒక్కటే’ అన్నారు. అందుకే మీరు ‘ఒరేయ్.. రిక్షా’, ‘ఒసేయ్.. రాములమ్మా’ అని గంభీరంగా పిలిచినా, ‘చిన్నా’ అని సున్నితంగా సైగ చేసినా మీ పిలుపులో మాకు ప్రేమే వినబడింది గానీ ‘అహంకారి’ కనపడలేదు గురువు గారూ.

‘సంసారం ఒక సాగరం’ అని చెప్పారు. ‘బంగారు కుటుంబం’లో బాంధవ్యాలు ‘పాలు నీళ్లు’లా ఎలా పెనవేసుకుపోవాలో వివరించారు. ‘అక్క పెత్తనం’ వల్ల ‘చెల్లెలి కాపురం’ ఎలా చెడిపోతుందో, ‘మామాకోడలు’ మధ్య ఉండాల్సిన మమకారం ఏంటో మీరు చెప్పినంత బాగా మరెవరూ మళ్లీ ఎప్పుడూ చెప్పలేకపోయారు గురువు గారూ. ‘కంటే కూతుర్నే కనాలి’ అని ఓ ‘నాన్నగారు’లా మురిసిపోయారు. ఆడది అంటే అబల కాదని, ప్రతి కుటుంబానికీ ఓ ‘ఆశాజ్యోతి’ అని సమాజం కళ్లుతెరిపించారు. ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’ ఇవ్వండి అని మీరు జారీ చేసిన ఆదేశాలు ఆదర్శనీయమండి.

‘అమ్మ రాజీనామా’ చేస్తే.. అనే ఆలోచన వస్తేనే చాలు కళ్లు చెమ్మగిల్లేలా, గుండెలు పిండేలా చూపగలగడం కళామ తల్లి ముద్దు బిడ్డగా మీకు కాక మరెవరికి సాధ్యం చెప్పండి గురువు గారూ. ‘మా అల్లుడు’ అని నలుగురికీ చెప్పుకొని ‘మామగారు’లా మురిసిపోయారు. ‘కోరికలే గుర్రాలైతే’ ‘యవ్వనం కాటేస్తుందని’ యువతీ యువకులను హెచ్చరించి సన్మార్గంలో నడిపారు.

చిత్ర పరిశ్రమలో మీరు ఎన్ని జంటలకు ‘బ్రహ్మముడి’ పడాలని ఆకాంక్షించారో, ఎంత మంచి మనసుతో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అని దీవించారో, ఆ దీవెనలు ఫలించడం వల్ల ఎంత మంది నటీనటులు ‘ఏడడుగుల బంధం’తో ఒక్కటయ్యారో మేము మర్చిపోలేదు గురువు గారూ. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజానికి సంబంధించి సినిమాల్లో మీరు చూపించని కోణం లేదు. ‘ఎంఎల్ ఏ ఏడుకొండలు’ రూపంలో రాజకీయాలను వెండితెరపై రక్తికట్టించడమే కాకుండా నిజ జీవితంలోనూ మీరు ఒక రాజకీయ నాయకుడిగా రాణించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ అని చాటిచెప్పారు. మీ ప్రతిభకు మెచ్చి మిమ్మల్ని వరించిన, ఆ’నందిం’చిన అవార్డులెన్నో కదా దర్శకరత్నా.

‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ అని చెప్పారు. అతణ్ని మీ చిత్రం ద్వారా ప్రేక్షకులకు చూపారు. అయితే ‘దాసరి గారు మళ్లీ పుట్టాడు’ అని మేమెప్పుడు మురిసిపోవాలి గురువు గారూ?

(దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా.. నివాళి అర్పిస్తూ..)