ఫేస్‌బుక్ బలం ఏమిటి?

26 December, 2017 - 5:32 PM

♦ మీడియా పల్స్

మనకు ఒక పది దినపత్రికలున్నాయి అనుకోండి!
మరో అరడజను కొత్తగా వచ్చాయి!
ఏమవుతుంది?
యాభై టీవీ చానళ్ళున్నాయి, మరో డజను చానళ్ళు వచ్చాయనుకుందాం! ఏమవుతుంది?
పోనీ పదిహేను రేడియో కేంద్రాలున్నాయి, మరో పది వచ్చి చేరాయి! ఏమవుతుంది?

మనకు ఇటీవలి అనుభవం ఏమిటంటే అవి చేయగలిగినవే చేయగలవు… అలాగే చేయగలిగి, చేయని పనులు కొత్తగా జరుగకపోవచ్చు! దీనికి కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆ మీడియాకు స్వతఃసిద్ధంగా కొన్ని పరిమితులుండటం లేదా ఎంతో కాలంగా తమకు తాము ఏర్పరచుకున్న పరిమితులు దాటి చూడకపోవడం కావచ్చు! అయితే కొత్త మాధ్యమం వచ్చి చేరినపుడు కలిగే ప్రయోజనం వేరుగా ఉంటుంది.

♦ ♦ ♦

ప్రఖ్యాత హింది కథానాయకుడు శశికపూర్ డిసెంబరు 4న ముంబాయిలో మరణించారు. ఒక రెండు తరాలకు బాగా తెలిసిన విభిన్న, విలక్షణ నటుడాయన. వారు కన్నుమూయడం దేశ వ్యాప్తంగా వార్త అయ్యింది. అది తప్పదు. అలాగే తెలుగు పత్రికలు కూడా వార్తలు, విశ్లేషణలు ప్రచురించాయి. డిసెంబరు 5న సాక్షిలో ప్రచురింపబడిన వ్యాసంలో “పృథ్విరాజ్ కపూర్ పులి. ఆయన కడుపున మూడు పులిపిల్లలు పుట్టాయి”. ఈ వ్యాసాన్నీ, ఈ వాక్యాన్నీ చాలా మంది చదివి వుంటారు. అయితే సుజాత వేల్పూరిగారు ఫేస్‌బుక్‌లో ఈ ధోరణిపై మంచి విశ్లేషణ చేశారు. దీన్ని చూడండి.

“పృథ్విరాజ్ కపూర్ పులి. ఆయన కడుపున మూడు పులి పిల్లలు పుట్టాయి”
నిన్న శశికపూర్ గురించి సాక్షిలో వచ్చిన వ్యాసంలో ఒక వాక్యం! :-))
తప్పదు, ఎంత వొద్దనుకున్నా ఈ పడికట్టు పదాలు మన భాషలో, మన మూల భావాల్లో ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి అలవోగ్గా పడిపోతుంటాయంతే!

“మా తాత సింహంలా బతికాడు, మా నాన్న పులిలా బతికాడు” అని ఒక హజ్బెండ్ గొప్పలు పోతే “అయితే మీ వంశంలో మనుషుల్లా బతికిన వాళ్ళెవరూ లేరన్నమాట” అందిట అవకాశం అందిపుచ్చుకున్న సతీమణి. క్రూర జంతువులతో పోల్చుకుని వాటితో ఐడెంటిఫై కావడం మనిషిలోని ఏ తత్వాన్ని సూచిస్తుందంటారు?
ఫాంటసీ?
ఫ్యూడల్?
పులి, సింహం ఏ రకంగా గొప్పవో ఎంత ఆలోచించినా పాయింట్ ఒక్కటీ తట్టట్లేదు.

పివి సింధు మ్యాచ్ గెలిస్తే “అమరావతి పులిబిడ్డ” లేదా “కాపుల పులిబిడ్డ”. ఇక రాజకీయ నాయకులు, వాళ్ల పిల్లలంతా పులులూ, పులి బిడ్డలూ సింహం కూనలూ!
కెసిఆర్ పులి. లోకేష్ బాబు సింహం కూన.

సినిమాలో హీరో గారు ముష్టెత్తి (అదే, పిడికిలి బిగించి) గాల్లోకి ఎగిరాడంటే వాడి మొహం పులిగా మారాల్సిందే గ్రాఫిక్స్‌లో.

ఇక తమను తాము పులుల్తో పోల్చుకునే ఆడ మగ జనాలకు అసలు లోటే లేదు. ఫేస్‌బుక్‌లో మరి చెప్పక్కర్లేదు.
పల్నాటి పులి, సింహపురి సింహం, గుంటూరు పులి, విజయవాడ పులిబిడ్డ, ఉత్త్తరాంధ్ర ఆడపులి, దక్షిణ కోస్తా సింహం.

ఈ పాయింట్ గురించి గమ్యంలో గాలి సీను చేత ఒక ముతక డైలాగ్ చెప్పించాడు క్రిష్!
పైగా హుందా, దర్పం, ఠీవి ఇలాటి వాటిని పులులు, సింహాల లక్షణాలుగా భావించి “ఆ ఠీవి, ఆ దర్పం, ఆ రాజసం” అంటుంటారు. అవేవో మహా గొప్ప లక్షణాలైనట్టు, అవి లేకపోతే మనుషులే కానట్టు.
మా నాన్నగారు పోయినపుడు, ఒకాయన “రావుగారు పులిలా బతికారు” అని వాక్రుచ్చాడు
మా నాన్నగారు పులి సంగతి అలా ఉంచి, అసలు ఆయన ఎంత సాఫ్ట్ మనిషో, ఆ మెతకదనం వల్ల మాకెన్ని తలనొప్పులొచ్చాయో మాకే తెలుసు :-))

నోటికి ఏదొస్తే అది అనేయడమే! పోయిన మనిషిని గొప్పాయన్ని చెయ్యాలంటే పులితో పోల్చడమే!
మొన్న ఒక కొలీగ్ “హైవే డ్రైవింగ్ విషయంలో నేనసలు పులి. భయం అక్కర్లేదు”
డాలస్‌లో మా ఫ్రెండ్ ఒకాయన వాళ్ల కుక్కకి టైగర్ అని ఇండియాలో పెట్టినట్టు పేరు పెట్టాడు. కుక్క పేరు టైగరేంటని తెల్లోళ్లంతా తెల్లబోయారు. పాపం వాళ్లకేం తెలుసు మన పులి శౌర్యానికి ప్రతీక అని!
మొదటి కానుపులో కొడుకు పుడితే “పులి కడుపున పులే పుట్టింది” అట! ఆయన పులి ఎట్లా అయ్యాడో, పాపం పసిబిడ్డ, వాడు పులి ఎలా అయ్యాడో వాళ్ల వంశానికే తెలియాలి.

శౌర్యానికి, వీరత్వానికి, ధైర్యానికి పులిని, సింహాన్ని పోలికగా వాడేసుకోడం అలవాటై పోయిందనుకుంటా మనకి!

నిజానికి బలహీనమైన జంతువుని వేటాడి కడుపు నింపుకోవడం తప్ప ఆ రెండు జంతువుల్లో ఉన్న శౌర్యం కోణం ఏవిటట? అసలు నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ల వీడియోలు చూస్తే జీబ్రాలు, ఎలుగు బంట్లు కూడా పులిని తరిమికొట్టే వీడియోలు బోల్డు.

ఎక్కడో మన మనసులో బుద్ధిలో, లోలోపల దాగున్న ఆధిపత్య ధోరణిని, కొద్దో గొప్పో క్రూరత్వాన్ని ఐడెంటిఫై చేసుకోడానికి అలవోకగా పులుల్తో సింహాలతో పోల్చుకోడం, బయటికి ఎన్ని అభ్యుదయం కబుర్లు, సమానత్వం కబుర్లు చెప్పినా అసలు తంతు ఇదే!
#పులికథ facebook/sujatha velpuri

♦ ♦ ♦

ఆ వాక్యం ఎవరు రాశారన్నది ప్రధానం కాదు. అది ఒక ధోరణికి ప్రతీక! అలానే పరిగణించాలి. అదేవిధంగా ఎవరు విశ్లేషించారు అనేది కూడా ప్రధానం కాదు. వాదనలో కొత్త విషయం కానీ, కొత్త చూపు గానీ ఉందా అనేది కీలకం. ఈ విధంగానే సుజాత వేల్పూరి గారిని అభినందించాలి.ఫేస్‌బుక్‌లో ఊక ఉంటుంది, ఉబుసుపోక ఉంటుంది, చెత్త ఉంటుంది, చెదారం ఉంటుంది- వంటి విమర్శలుంటాయి. ఈ విమర్శలలో నిజం కూడా ఉంది. అలా అనినప్పుడు పత్రికలలో, టీవీ చానళ్ళలో ఇలాంటి విషయాలుండవా? ఎందుకుండవు? అదే సమయంలో పనికొచ్చే విషయాలు అన్నింటిలో ఉంటాయి. దీన్ని గమనించాలి! ఇది వరకు మనం పరిశీలించిన విశ్లేషణను ఆ పత్రికకు పంపితే ప్రచురిస్తారా? పోనీ పోటీ పత్రిక ప్రచురిస్తుందా? రెండూ సాధ్యం కావు. ఒకటి స్పేస్, రెండు పాలసీ! ఈ రెండు కారణాలతో వీలుపడదు. రెండో పార్శ్వం ఏమిటంటే- ఫేస్‌బుక్‌లో రాసేవాడు, ఎడిట్ చేసుకునేవాడు, వెలువరించేవాడు ఒకరే- కనుక ఇందులో ఇలాంటి విషయాలు వీలుపడుతున్నాయి.

అందుకే దీనిని సమాంతర వేదికగా పరిగణిస్తున్నాం. ఫేస్‌బుక్‌లో ఈ అంశాన్ని పరిశీలించినవారు చర్చ కొనసాగించారు. అందులో 101 వాఖ్యలు కనబడుతున్నాయి. అవన్నీ కూడా సమాజంలో తారసపడే ఆలోచనా ధోరణులకు ప్రతీకలే! వాదోపవాదాల మధ్యలో “మృగాడు” మాట గురించి చర్చ జరిగింది. ఈ మాటను మీడియా వాడటం మానెయ్యాలి. ఎందుకంటే క్రూరత్వానికి జెండర్ ఉండదని మరో చర్చ ఐదు రోజుల తర్వాత జరిగింది. దీనిపై కూడా అర్థవంతమైన వాదనలు వచ్చాయి.

ఇటువంటి సమాంతర కోణం, అర్థవంతమైన చర్చ- కేవలం ఫేస్‌బుక్ అందుబాటులో ఉండటం వల్లనే సాధ్యమైంది. అదే న్యూ మీడియా బలం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాన స్రవంతి పత్రికలు, చానళ్ళు స్పృశించని ఎన్నో విషయాలు ఫేస్‌బుక్‌లో లోతుగా కనబడుతున్నాయి. అందులో అర్థరాహిత్యం, విశృంఖలమైన భాష, సంస్కార రహితమైన వాదన ఉండవచ్చు. అయితే అవి ఖచ్చితంగా “ఇష్యూస్” అవుతాయి. ఈ పోకడ గమనించే పత్రికలు, చానళ్ళు తమను తాము దిద్దుకొంటే ప్రజలకు దగ్గరగా వస్తాయి. లేదంటే రేపు న్యూ మీడియాదే పైచేయి కావచ్చు!

– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు