విండీస్ వెన్నువిరిచిన ఇషాంత్

24 August, 2019 - 8:26 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అంటిగ్వా: ఆతిథ్య వెస్టిండీస్‌తో ఆంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ సైన్యం పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆటలో జడేజా (58) అద్భుత పోరాటం చేశాడు. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులకు ఆలౌట్ అయింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ వెన్నును ఇషాంత్‌ శర్మ (5/42) విరిచేశాడు. ఇషాంత్ స్వింగ్‌కు విండీస్ టాపార్డర్ విలవిలలాడి కుప్పకూలిపోయింది. రోచ్‌ (48) పట్టుదలతో ఆడి ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో విండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ కాట్ అండ్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విండీస్ జట్టు వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది. విండీస్‌ తరఫున షై హోప్‌, హెట్‌మైయర్‌ జోడీ మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మంచి సమన్వయంతో చెత్త బంతుల్ని మాత్రమే శిక్షిస్తూ వీరిద్దరూ తమ ఇన్సింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు యత్నించారు. కానీ లంబూ ఇషాంత్ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తక్కువ పరుగుల వ్యవధిలో వీరిని కూడా ఔట్‌ చేశాడు. 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌(24), 56వ ఓవర్‌లో మూడో బంతికి హెట్‌మైయర్‌ (35), ఆఖరి బంతికి రోచ్‌ (0)లను వెంటవెంటనే ఔట్‌ చేసి విండీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. బుమ్రా, షమీ, జడేజాలు కూడా తలో వికెట్ తీసుకున్నారు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో విండీస్ కెప్టెన్‌ హోల్డర్‌ (10), కమిన్స్ ఉన్నారు.