పెట్రో ధరల్ని నాలుగు రోజుల్లో దించుతాం

23 May, 2018 - 10:34 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రారంభమైన పెట్రో ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది. పెట్రో ధరల పరుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోదీ గట్టెక్కిస్తారని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు మోదీ చర్యలు తీసుకుంటారని అమిత్ షా హామీ ఇచ్చారు. ధరల తగ్గింపు కోసం ఉన్నత స్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడు నాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా పేర్కొన్నారు. ఓ చక్కని పరిష్కారంతో మోదీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.

మరోవైపు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీకి సిద్ధమయ్యారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని తెలిపారు.