చెత్తగా ఆడాం.. అందుకే ఓడాం..

13 August, 2018 - 11:20 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

లండన్‌: చెత్తగా ఆడినందువల్లే తాము లార్డ్స్ టెస్ట్‌లో ఘోరంగా ఓడిపోయామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వాపోయాడు. లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం మీడియాతో విరాట్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌‌లో దారుణంగా ఆడిన తమకు గెలిచే అర్హత లేదన్నాడు.

‘మా ఆటతీరు చెత్తగా ఉంది. మరీ ఇంత అధ్వాన్నంగా ఆడటం గడచిన ఐదు టెస్టుల్లో ఇదే తొలిసారి. ఈ టెస్టులో మాకు గెలిచే అర్హత లేదు. పిచ్‌‌ను నిందించను. ప్రతికూల వాతావరణ పరిస్థితులంటూ సాకులు చెప్పను. పిచ్‌ కుదురుగా ఆడేందుకే అవకాశమిచ్చినా.. మొత్తంగా మేం కొంచెం కూడా బాగా ఆడలేదంతే! ఆటలోనే కాదు తుది జట్టు కూర్పులో కూడా పొరపాటు చేశాం. స్పిన్నర్‌‌కు బదులు మరో సీమర్‌‌నే తీసుకోవాల్సింది. నా వెన్నునొప్పి సమస్య కాదు. మూడో టెస్టుకు మరో ఐదు రోజుల విరామం ఉంది. తప్పకుండా కోలుకుంటాన’ని కెప్టెన్‌ కోహ్లి పేర్కొన్నాడు.

లార్డ్స్‌లో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఘోరాతి ఘోరమైన ఓటమి చవిచూసింది. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తరువాత విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టుకు ఇదే తొలి ఇన్నింగ్స్ పరాజయం.

మరోవైపు భారీ విజయాన్ని అందించిన తమ బౌలర్లపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ ప్రశంసలు కురిపించాడు. సమష్టిగా రాణించి గెలిచామని చెప్పాడు. ‘మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. అండర్సన్, వోక్స్‌‌ల ప్రదర్శన అసాధారణం. ముఖ్యంగా వోక్స్‌ బాగా ఆడాడు. తానెంత ప్రతిభావంతుడో మరోసారి చాటుకున్నాడు. నిలకడగా కష్టపడుతున్నాడు. నాలుగు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడంతో మూడో టెస్టుకు అదనంగా లభించిన విశ్రాంతి రోజును సద్వినియోగం చేసుకుంటాం. నిజానికి మేం ఇంకా మా పూర్తిస్థాయి ఆటతీరును ప్రదర్శించలేదు. అయినా సీరీస్‌‌లో మేం మంచి స్థితిలో ఉన్నామ’ని వివరించాడు.

గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తర్వాత తన ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నట్టు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకున్న క్రిస్‌ వోక్స్‌ తెలిపాడు. వర్షం కారణంగా ఒక రోజు ఆట పూర్తిగా రద్దయిన తర్వాత కూడా మూడు రోజుల్లోనే తాము గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. సెంచరీతో విఖ్యాత లార్డ్స్‌ మైదానంలోని ఆనర్స్‌ బోర్డులో తన పేరు చూసుకోవడం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశాడు.