జనసేనానితో ‘వాటర్ మేన్’ భేటీ!

23 September, 2019 - 10:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జల సంరక్షణ అవసరం చాలా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వర్షాలు, వరదలు ఉన్నా.. జల నిర్వహణ సమర్థంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి ప్రజల వలసలు పెరిగిపోవడానికి కారణం వ్యవసాయ రంగం దెబ్బతినడమే అన్నారు. ఏపీలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో ప్రముఖ పర్యావరణవేత్త, జల సంరక్షకుడు ‘వాటర్ మేన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్ర సింగ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో యురేనియం కోసం అన్వేషణ, జల సంరక్షణ, వాటర్ బాడీస్‌ను కాపాడుకోవడంలో పాలకుల వైఫల్యాలపై వారిద్దరూ చర్చించారు. నల్లమలలో యురేనియం కోసం అన్వేషణ, ఫలితంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన, జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో చెంచులు, పర్యావరణవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను రాజేంద్ర సింగ్‌తో పవన్ కల్యాణ్ పంచుకున్నారు.ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాల కారణంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగి మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల నిర్వహణ సమర్థంగా ఉన్నప్పుడే పాలన సక్రమంగా ఉన్నట్లు అని ఆయన అభిప్రాయపడ్డారు. నదులు, తటాకాలు, చెరువులను  కలుషితం చేస్తున్నా ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని, పర్యావరణంపై పాలకులకు శ్రద్ధ లేదని వాటర్ మేన్ ఆఫ్ ఇండియా ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం అన్వేషణ, తవ్వకాలపై జనసేన పార్టీ నిర్వహించే సమావేశాలు, జలరక్షణ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు. ఇలాంటి అంశాలపై మరోసారి భేటీ కావాలని పవన్ కల్యాణ్, రాజేంద్ర సింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధి, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.