హీరోగా వినాయక్ ఫస్ట్ లుక్!

08 October, 2019 - 9:42 PM

ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా మంగళవారం నాడు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్రం యూనిట్ విడుదల చేశారు. అందులో వినాయక్‌ మెకానిక్‌ షెడ్‌లో నుంచి నడిచివస్తున్నట్టు చూపించారు. సరికొత్త మేకోవర్‌లో, చేతిలో రెంచ్‌తో మాస్ లుక్‌లో వినాయక్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం వినాయక్‌ బరువు తగ్గారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ మూవీకి కెమెరామన్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వినాయక్‌ పుట్టిన రోజున (అక్టోబర్‌ 9) ప్రారంభం అవుతుంది. దర్శకుడిగా పలువురు తెలుగు హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన వినాయక్‌.. మాస్‌లుక్‌లో వస్తున్న ఈ చిత్రంలో హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి.