ప్రశాంతంగా…

05 December, 2019 - 3:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)
 బెంగళూరు: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్) చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు పడింది. అయితే ప్రస్తుతం 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా మిగత రెండు నియోజకవర్గాలకు సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు సైతం .. గురువారం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7.00 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. డిసెంబర్ 9వ తేదీన ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో 37,77,970 మంది ఓటర్లు ఉండగా.. 4185 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీలు సహా 165 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. 42509 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
అనర్హత వేటుకు గురై.. బీజేపీలో చేరిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలలో .. 13 మందిని ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం 15 నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను పోటీకి నిలపగా..జేడీ ఎస్ మాత్రం 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఈ ఎన్నికలు యడ్యూరప్ప ప్రభుత్వానికి కీలకంగా మారాయి. మొత్తం 225 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి యడ్యూరప్ప ప్రభుత్వం మనుగడ సాగించాలంటే.. బీజేపీ 6 సీట్లు గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ .. ఈ ఉప ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఆ క్రమంలో కనీసంలో కనీసం 10 స్థానాల్లో విజయం సాధించాలని కమల దళం లక్ష్యంగా పని చేస్తోంది. మరోవైపు అధికార బీజేపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేసింది. అవసరమైతే.. ఈ ఎన్నికల తర్వాత జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని.. మళ్లీ కమలం పార్టీని కష్టాల కొలిమిలోకి నెట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచన చేస్తోంది. కాగా ఈ ఉప ఎన్నికలను ప్రతీష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ… ప్రలోభాలకు తెర తీసింది. అందులోభాగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ… పలువురు బీజేపీ నేతలు కెమెరా కంటికి చిక్కారు.