విశ్వరూపం 2 సినిమా రివ్యూ..!

10 August, 2018 - 3:58 PM

సినిమా: విశ్వరూపం 2
జానర్: యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌
నటీనటులు: కమల్‌ హాసన్‌, శేఖర్ కపూర్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, వహీదా రెహమాన్‌ తదితరులు
సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌
దర్శకత్వం: కమల్‌ హాసన్‌
నిర్మాత: కమల్‌ హాసన్‌, చంద్ర హాసన్‌
పాటలు: రామజోగయ్యశాస్త్రి
ఛాయాగ్రహ‌ణం: శ్యాం ‌దత్, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్
కూర్పు: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌
మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
సమర్పణ: వి.రవిచంద్రన్‌
లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన సూపర్‌ హిట్ సినిమా విశ్వరూపం. క‌మ‌ల్‌ హాస‌న్‌‌లో ఎంత మంచి న‌టుడున్నాడో.. అంత‌కు మించిన సాంకేతిక నిపుణుడు క‌నిపిస్తాడు. ముఖ్యంగా కమల్ ఒక మంచి క‌థ‌కుడు. ఆ విష‌యాన్ని ప‌లు చిత్రాల‌తో నిరూపించారు కూడా. తాను చెప్పాల‌నుకొన్న విష‌యాన్ని స్పష్టంగా, ధైర్యంగా చెబుతుంటారు. సున్నిత‌మైన ఉగ్రవాదం నేప‌థ్యాన్ని ఎంచుకొని ‘విశ్వరూపం’ తెర‌కెక్కించారు. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్‌‌గా విశ్వరూపం 2ను శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కమల్‌.వివిధ కారణాలతో వరుస వాయిదాల తరువాత విడుదల అయిన విశ్వరూపం 2పై ఆశించిన స్థాయిలో హైప్‌ క్రియేట్‌ కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం 2 ప్రేక్షకులను ఎంతవరకూ అలరించింది? దర్శకుడిగా కమల్ మరోసారి ఆకట్టుకున్నారా? ఓ లుక్కేద్దాం.

స్టోరీ:
కమల్ విశ్వరూపం 2 కథను తొలి భాగానికి పూర్తిస్థాయి కొనసాగింపుగా తయారు చేసుకున్నారు. చాలా సన్నివేశాలకు విశ్వరూపంతో లింక్‌ ఉండటంతో ఆ సినిమా చూసిన వారికే విశ్వరూపం 2 పూర్తిగా అర్థం అవుతుంది. తొలి భాగంలో న్యూయార్క్‌ మిషన్‌ పూర్తిచేసిన విసామ్ (కమల్‌ హాసన్‌) మరో మిషన్‌ మీద లండన్‌ వెళ్తాడు. లండన్‌‌లో భారీ విధ్వంసానికి జరుగుతున్న కుట్రను తన భార్య నిరుపమా (పూజా కుమార్‌), అస్మితా సుబ్రమణ్యం (ఆండ్రియా)తో కలిసి ఛేదిస్తాడు. అదే సమయంలో తొలి భాగం చివర్లో విసామ్‌ నుంచి తప్పించుకున్న అల్‌ ఖైదా ఉగ్రవాది ఒమర్‌ ఖురేషీ (రాహుల్‌ బోస్‌) ఢిల్లీలో సీరియల్‌ పేలుళ్లకు ప్రణాళిక వేస్తాడు.ఇండియ‌న్ ‘రా’ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే సైనిక గూఢ‌చారి విసామ్ అహ్మద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌ హాస‌న్‌). అల్‌‌ఖైదా ఉగ్రవాదుల‌తో క‌లిసిపోయి వాళ్ల వ్యూహాల్ని ఎప్పటిక‌ప్పుడు సైన్యానికి చేర‌వేస్తూ అనేక ఉగ్ర దాడులను ఆపుతాడు. ఆ విష‌యం తెలిసిపోవ‌డంతో విసామ్‌ని అంతం చేయడమే పనిగా పెట్టుకుంటాడు ఉగ్రవాది ఒమ‌ర్ ఖురేషి. భారతదేశంలో 64 చోట్ల బాంబు దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు ర‌చిస్తాడు. యూకే స‌ముద్ర అంత‌ర్భాగంలో ఒక నావ‌లో ఉన్న బాంబుల్ని పేల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు, ఒమ‌ర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు? అనేది తెర‌పై చూడాలి.

యూకేలో విసామ్‌‌పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. అక్కడ తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. అప్పటి వరకూ న‌త్తన‌డ‌క‌గా సాగిన‌ట్టు అనిపించిన క‌థ కూడా ప‌ట్టాలెక్కిన‌ట్టు అనిపిస్తుంది. కానీ.. ఆ ఎపిసోడ్ త‌ర్వాత క‌థ మొద‌లైన చోటకే మళ్లీ వ‌చ్చి ఆగిపోయిన‌ట్టు అనిపిస్తుంది. రా అధికారులకు, క‌మ‌ల్‌‌హాస‌న్‌‌కు మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. చెప్పడానికి క‌థేమీ లేక‌పోవ‌డంతో సంభాష‌ణ‌ల‌తో స‌న్నివేశాల్ని సాగ‌దీశారు. అస‌లు సినిమా ఇంత సాగినా క‌థేమీ లేదు క‌దా? అని డౌట్ వ‌చ్చిన‌ట్టుందో ఏమో అప్పటిక‌ప్పుడు యూకేలో బాంబు పేలుడు జ‌రగ‌కుండా ఓ యాక్షన్ ఎపిసోడ్ మొద‌లవుతుంది. దాంతో సినిమాకి విరామం కార్డు ప‌డుతుంది. ఆ త‌ర్వాత క‌థ ఢిల్లీకి మారుతుంది. త‌ల్లీ, కొడుకుల‌ మ‌ధ్య జరిగే సెంటిమెంట్ స‌న్నివేశాలు హృద‌యాల్ని హ‌త్తుకుంటాయి. ఆ త‌ర్వాత ఖురేషీ గ్యాంగ్‌, విసామ్ మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. విసామ్‌‌కు కాబోయే భార్య నిరుప‌మను, త‌ల్లిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ నుంచి వాళ్ళని ఎలా రక్షించాడు? ఖురేషినీ ఎలా అంతం చేశాడు? ఇండియాలో 64 చోట్ల పెట్టిన బాంబుల్ని కూడా పేల‌కుండా ఎలా అడ్డుకున్నాడ‌నే విష‌యాల‌తో శుభం కార్డు ప‌డుతుంది. క‌థంతా ఊహించినట్టుగానే కొనసాగుతుంది.
ఎవరి నటన ఎలా ఉందంటే..:
ఈ మూవీలో కమల్ హాసన్ అభిన‌యం సహజంగానే ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా తొలి స‌గ‌భాగంలో ఈశ్వర‌శాస్త్రితో క‌లిసి చేసిన స‌న్నివేశాలు, అక్కడ సంభాష‌ణ‌లు, ద్వితీయార్ధంలో త‌న త‌ల్లిగా న‌టించిన వహీదా రెహమాన్‌‌తో క‌లిసి నటించిన తీరు బాగుంటాయి. కమల్‌ హాసన్‌ మరోసారి అద్భుతమైన నటనతో సినిమాను నడిపించారు. ఈ వయసులో కూడా యాక్షన్‌ సీన్స్‌‌లో మంచి ఈజ్‌ కనబరిచారు. ఆయన బాడీ లాంగ్వేంజ్‌, డైలాగ్‌ డెలివరీ నిజంగా ‘రా’ ఏజెంట్‌‌నే చూస్తున్నామా అన్నంత వాస్తవికంగా ఉన్నాయి. హీరోయిన్లు పూజా కుమార్‌, ఆండ్రియాలకు రెండు భాగాల్లోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ఆండ్రియా యాక్షన్‌ సీన్స్‌‌లోనూ అదరగొట్టింది. విలన్‌‌గా రాహుల్ బోస్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో క్రూరమైన తీవ్రవాదిగా మెప్పించాడు. రాహుల్ బోస్ న‌ట‌న ద్వితీయార్ధంలో మ‌రింత స‌హ‌జంగా సాగుతుంది. ఆర్మీ అధికారిగా శేఖర్‌ కపూర్‌, జైదీప్‌, వాహీదా రెహమాన్‌ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.విశ్లేషణ:
విశ్వరూపం సినిమాతో హాలీవుడ్ స్థాయి స్పై థ్రిల్లర్‌‌ను దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం చేసిన కమల్‌ హాసన్‌ విశ్వరూపం 2తో అదే మ్యాజిక్‌‌ను రిపీట్ చేయలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం రిలీజై చాలా కాలం అవటం.. సీక్వెల్‌‌లో చాలా సన్నివేశాలు తొలి భాగంతో లింక్‌ అయి ఉండటంతో ప్రేక్షకులు పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేరు. తొలి భాగంలో ఉన్న ఇంటెన్సిటీ కూడా ఈ సీక్వెల్‌‌లో మిస్‌ అయ్యింది. ఇంటర్వెల్‌ బ్లాక్‌ లాంటి ఒకటి రెండు సీన్స్ వావ్‌ అనిపించినా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో నిమగ్నం కావటం కష్టమే. తొలి భాగంలో ఫ్లాష్ బ్యాక్‌‌కు సంబంధించిన చాలా సన్నివేశాలు విశ్వరూపం తొలి భాగంలోని సీన్సే కావటం కూడా నిరాశ కలిగిస్తుంది.ఓ స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన మూడ్ క్రియేట్‌ చేయటంలో సంగీత దర్శకుడు గిబ్రాన్‌ సక్సెస్‌ అయ్యారు. తొలి భాగానికి ఏమాత్రం తగ్గ కుండా అంతర్జాతీయ స్థాయి సంగీతం అదించారు. సినిమాటోగ్రఫీ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. అయితే అక్కడక్కడా గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయి. విశ్వరూపం 2కు ఓ రూపు తీసుకురావటంతో ఎడిటర్లు మహేష్‌ నారాయణ్‌, విజయ్‌ శంకర్‌ కష్టం చాలా ఉంది. ఎక్కువగా తొలి భాగానికి సంబంధించిన సీన్స్‌‌ను రిపీట్‌ చేస్తూ రూపొందించిన స్క్రీన్‌‌ప్లేకు తగినట్టుగా మంచి అవుట్‌‌పుట్‌ ఇచ్చారు ఎడిటర్లు. కమల్‌ నిర్మాతగా కూడా తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చారు.
నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. తొలి భాగంతో పోలిస్తే ద‌ర్శకుడిగా, క‌థ‌కుడిగా కమల్ హాసన్ కాస్త నిరాశ‌ప‌రుస్తాడు. సంభాష‌ణ‌లు సామాన్య ప్రేక్షకుల‌కు తేలిగ్గా అర్థం కాని రీతిలో, నిగూఢ‌మైన అర్థాల‌తో వినిపిస్తుంటాయి.

బలాలు:
కమల్‌ హాసన్‌ నటన
ఇంటర్వెల్‌ సీన్‌
నేపథ్య సంగీతం
కథ నేప‌థ్యం
న‌టీన‌టులు
పోరాట ఘ‌ట్టాలు
బలహీనతలు:
స్లో నెరేషన్‌
పెద్దగా థ్రిల్స్‌ లేకపోవటం
క్లైమాక్స్‌