విరిగిన విరాట్ కోహ్లీ కుడి చెవి!

08 June, 2018 - 11:44 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడిచెవి పాక్షికంగా విరిగిపోయింది. అంటే.. ఇది నిజంగా కోహ్లీ అసలు చెవి కాదండోయ్.. న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఆయన మైనపు బొమ్మ కుడి చెవి.రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని మన దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జూన్ 6 బుధవారం ఉదయం మ్యూజియం నిర్వాహకులు కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోహ్లీ విగ్రహాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆ విగ్రహంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.ఈ క్రమంలో కోహ్లీ కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టారు. కోహలీ కుడి చెవికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. వీలైనంత త్వరగా దాన్ని తయారు చేసి పంపాలని కోరినట్లు తెలుస్తోంది.దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. స్థానిక వార్తాపత్రికల్లో గురువారమే ఇందుకు సంబంధించి వార్తలు వచ్చాయి.

టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మూడో భారత క్రికెటర్‌ విగ్రహం కోహ్లీది. గతంలో కపిల్‌‌దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.