వ్యక్తిగత జీవితంలోకి చూడొద్దు.. ప్లీజ్

12 May, 2018 - 4:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై పలువురు నిరంతరం దృష్టి సారించడం తమకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత గత ఏడాది డిసెంబర్‌‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు మా జోడీపై మీడియా, ప్రజలు దృష్టిపెట్టడం వరకు ఒకే కానీ, ఇప్పుడు మేం దంపతులం అయ్యాక కూడా అదే కొనసాగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ -11వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌‌గా వ్యవహరిస్తున్న కోహ్లి జట్టుకు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. అయితే ఏం జరిగినా ఫలితాన్ని తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడంపై కోహ్లి స్పందించాడు.

‘మేం వృత్తిగతంగా, వ్యక్తిగతంగా రాణించాల్సి ఉంటుంది. ఆటతో పాటు నేను కుటుంబం బాధ్యతలు నిర్వహించాలి. కానీ తరచుగా మా దంపతుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అసౌకర్యంగా ఉంది. సెలబ్రిటీలు అందరిలాంటి మనుషులే. వారికి కూడా సమస్యలుంటాయి. మా వ్యక్తిగత విషయాలపై చర్చించకుండా, మాకు స్వేచ్ఛ కల్పించాలి. బిజీ షెడ్యూళ్ల కారణంగా కొన్నిసార్లు ఫ్యామిలీకి సమయం కేటాయించలేం. వీటితో పాటు ఆటగాడిగా ఫిట్‌‌నెస్ కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. ఖాళీ సమయం దొరికినప్పుడు స్నేహితులతో సమయం గడపాలని, సినిమాలు చూడాలనిపిస్తుంది’ అంటూ పలు అంశాలను ప్రస్తావిస్తూ కోహ్లీ కాసింత భావోద్వేగానికి గురయ్యాడు.