పిచ్ అంచనాలో పొరబడ్డాం

16 April, 2018 - 5:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలోని పిచ్‌‌ను తప్పుగా అంచనా వేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌‌పై ఓడిపోయామని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో ఆర్సీబీ సొంత మైదానంలోనే రాజస్థాన్ రాయల్స్ చిత్తు చేసింది. టాస్‌ గెలిచిన కోహ్లి పిచ్‌ బౌలింగ్‌‌కు అనుకూలిస్తుందని ఫీల్డింగ్‌ వైపు మొగ్గుచూపాడు. కానీ బంతి సులువుగా బ్యాట్‌‌పైకి వెళ్లడంతో రాజస్థాన్‌ బ్యాట్స్‌‌మన్‌ సంజూశాంసన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ఆర్సీబీకి రాజస్థాన్‌ 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాట్స్‌‌మన్‌ తడబడటంతో రాజస్థాన్‌ సులువుగా విజయం సాధించింది.

‘పిచ్‌ చాలా నెమ్మదిగా ఉంటుందని భావించా. కానీ రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌‌లో మేం ఆశ్చర్యపోయేలా బంతి నేరుగా బ్యాట్‌‌పైకి వెళ్లింది. రెండు వందల పరుగులు చేసే వికెట్‌ అని ఊహించలేదు. కానీ జరిగింది. టీ 20లో ఇది సహజమే’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 47 పరుగులిచ్చిన బౌలర్‌ క్రిస్‌‌వోక్స్‌‌ను కోహ్లి సమర్థించాడు. ‘ప్రతిసారి క్రిస్‌‌వోక్స్‌ సరిగ్గా బౌలింగ్‌ చేయాలనేం లేదు. అతన్ని వేలంలో అధిక ధర వెచ్చించి తీసుకున్నందుకు వికెట్లు తీయాలి. ఇక ఉమేశ్‌ యాదవ్‌ (4 ఓవర్లకు 59) ధారాళంగా పరుగులివ్వడం, ఈ వికెట్‌‌పై రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి 400 పరుగులు నమోదు కావడంతో ఇది మా రోజు కాదు. ఈ మ్యాచ్‌ విషయంలో బౌలర్లు తమని తాము నిందించుకోవాల్సిన అవసరం లేద’ని కోహ్లి అభిప్రాయపడ్డాడు.

ఈ వికెట్‌ పిచ్‌‌పై 200 పరుగుల టార్గెట్‌ నమోదవుతుందని అనుకోలేదని ఈ నేపథ్యంలోనే టాస్‌ గెలిచినా ఫీల్డింగ్‌ వైపు మొగ్గు చూపినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. ఇక చివర్లో మన్‌‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ పోరాటాన్ని కోహ్లి కొనియాడాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌‌మెన్‌ అద్భుతంగా పోరాడారని, ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా జట్టుపై నమ్మకం ఉంచేలా ఆడారని ప్రశంసించాడు.