ఈసారి ‘అవార్డు’ కోహ్లీకెంతో స్పెషలట!

13 June, 2018 - 3:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: బాలీవుడ్‌ నటి, తన సతీమణి అనుష్కశర్మ ముందు అవార్డు అందుకోవడం తనకెంతో ప్రత్యేకం అని మురిసిపోతున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. బెంగళూరులో మంగళవారం రాత్రి జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన కోహ్లిని ‘పాలీ ఉమ్రీగర్‌’ ట్రోఫీ వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి చేతుల మీదుగా అందుకోవడం ఒక విశేషం అయితే.. ఈ కార్యక్రమానికి అనుష్కశర్మ హాజరవ్వడం మరో విశేషం.

ఈ అవార్డు అందుకున్న తరువాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘నా భార్య సమక్షంలో అందుకున్న ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. గత ఏడాది కూడా ఈ అవార్డు అందుకున్నాను. అప్పుడు ఇంతటి అనూభూతి కలగలేదు. ఎందుకంటే అప్పుడు ఆమె లేదు’ అని తెలిపాడు. కోహ్లీ మాట్లాడుతున్న సమయంలో అనుష్క శర్మ నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో, వీరిద్దరి ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌‌గా మారాయి. విరుష్క జోడీ ఒకే రంగు దుస్తుల్లో ఈ కార్యక్రమానికి హాజరైంది.

2016-17, 2017-18ల సీజన్లలో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఈ రెండు సీజన్లకు ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచాడు. 2016-17లో 13 టెస్టుల్లో 74 సగటుతో 1,332 పరుగులు, 24 వన్డేల్లో 84.22 సగటుతో 1,516 పరుగుల్ని కోహ్లీ చేశాడు. 2017-18 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 టెస్టుల్లో 89.6 సగటుతో 896 పరుగులు చేశాడు. ఇక కోహ్లీతో పాటు అన్షుమన్‌ గైక్వాడ్, సుధా షాలకు ‘సీకే నాయుడు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌‌మెంట్‌’ అవార్డులు వరించాయి.రెండు సీజన్లలో వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లందరూ అవార్డులు అందుకున్నారు. భారత ‘ఎ’ జట్టుతో పాటు ఇంగ్లండ్‌ వెళ్లిన కృనాల్‌ పాండ్యా మినహా మిగతా వారంతా స్వయంగా అవార్డులు అందుకున్నారు. అండర్‌–16 విభాగంలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన తెలుగు కుర్రాళ్లు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (హైదరాబాద్‌ జట్టు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (ఆంధ్ర జట్టు)లకు దిగ్గజ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడి ‘జగ్మోహన్‌ దాల్మియా’ అవార్డు అందజేశారు.

కాగా.. మెడకు గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ శుక్రవారం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌‌నెస్‌ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఫిట్‌‌నెస్‌ టెస్టులో కోహ్లీ పాసైతే జూన్‌ చివరి వారంలో ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో కలవనున్నాడు.