రోహిత్ ఎంపికపై కోహ్లీ స్పందన

09 January, 2018 - 1:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 72 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత భారత జట్టు వైఫలయ్యాలపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. టెస్టుకు తుది జట్టు ఎంపికలో విదేశీ గడ్డపై రాణించే వైస్ కెప్టెన్ అజింక్యా రహనేను కాదని రోహిత్ శర్మను తీసుకోవడంపై టీమిండియా విశ్లేషకులు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు రోహిత్‌ అతి కష్టం మీద తొలి ఇన్సింగ్స‌లో 11 పరుగులు చేయగా, రెండో ఇన్సింగ్స్‌లో 10 పరుగులు చేయగలిగాడు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ను అనవసరంగా ఎంపిక చేశారంటూ సెలక్షన్‌ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం ఆ నిర్ణయం సరైందేనని వ్యాఖ్యానించారు. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్‌ను ఎంపిక చేయటానికి కారణాలను వివరించాడు. ప్రస్తుతం రోహిత్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే అతన్ని ఎంపిక చేశామని చెప్పాడు.

‘ప్రస్తుతం ఆటగాళ్ల ఫామ్‌‌ ఆధారంగానే తుది జట్టు ఎంపిక చేశాం. రోహిత్ శర్మ ఆడిన చివరి మూడు టెస్టు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. బాగానే స్కోర్‌ చేశాడు. శ్రీలంక సిరీస్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అతని ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే తుది జట్టులోకి తీసుకున్నాం. ఓ జట్టుకు అదే కీలకం కూడా. విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జట్టు బాగా ప్రాక్టీస్‌ చేసింది. కానీ, విఫలం అయ్యాం’ అని కోహ్లీ వివరించాడు.