ఆసీస్ బెస్ట్ బౌలర్‌కు అండగా కోహ్లీ!

08 January, 2019 - 3:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సిడ్నీ: ఆసీస్‌ ప్రధాన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. సోమవారంతో ముగిసిన టీమిండియా ఆస్ట్రేలియా టూర్ టెస్టు సీరీస్‌‌లో స్టార్క్ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎంతో కాలంగా ఆసీస్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్క్‌.. ఏదో ఒక సీరీస్‌‌లో ఆకట్టుకోలేకపోతే ఆ దేశ మాజీలు ఒక్కసారిగా విమర్శలు ఎక్కుపెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా గాడి తప్పడం సహజమే అని, అలాంటి తరుణంలో వారికి మద్దతుగా ఉండాలే గానీ విమర్శిచడం ఏమిటని కోహ్లీ ప‍్రశ్నించాడు. బెస్ట్‌ బౌలర్‌‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ కోహ్లీ నిలదీశాడు.

‘అనేక సంవత్సరాలుగా స్టార్క్‌ మీ జట్టులో అగ్రశ్రేణి బౌలర్‌‌గా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అదే బౌలర్‌‌పై వరుసగా విమర్శలు చేయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్క్‌ మీ అత్యుత్తమ బౌలర్‌ అనుకుంటే అతనికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. మళ్లీ గాడిలో పడటానికి అతనికి మద్దతుగా నిలవండి. అంతే కానీ విమర్శలు చేస్తే అతనిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అపార నైపుణ్యం ఉన్న ఈ తరహా బౌలర్‌‌పై ఒత్తిడి పెంచి దూరం చేసుకోవద్దు. ఆస్ట్రేలియా సాధించిన ఎన్నో విజయాల్లో స్టార్క్‌ ప్రధాన పోషిస్తూ వస్తున్నాడు. అతని సేవల్ని కోల్పోవద్దు’ అని కోహ్లీ సూచించాడు.

టీమిండియాతో సోమవారం వరకూ జరిగిన టెస్టు సీరీస్‌‌లో స్టార్క్‌ 13 వికెట్లు తీశాడు. దాంతో ఆసీస్‌ దిగ్గజ ఆటగాళ్లు షేన్‌ వార్న్‌, మిచెల్‌ జాన్సన్‌‌లు విమర్శలు సంధించడంతో కోహ్లీ స్పందించాడు.