మరి విడ్డూరం అంటే ఇదే!

07 September, 2018 - 2:47 PM

భారత రాజకీయ నాయకులలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ది విభిన్న శైలి అనే చెప్పాలి. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నా.. ఆయన రూటే సపరేట్. సమోసాలో అలూ ఉన్నంత కాలం లూలూ ఉంటాడంటూ చమత్కరించిన బీహారీ మహానేత. ఇంకా చెప్పాలంటే ఆయన ఏ పదవిలో ఉంటే ఆ పదవికి తగ్గట్లు కుంభకోణం చేసి.. ప్రజా ధనాన్ని అమ్యాయ్యం చేసిన చురుకైన మహాభోక్త.

బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువు మేయాల్సిన దాణాని నగదు రూపంలో కోట్ల రూపాయిలు ఆయనగారు మేసేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసి… దర్యాప్తు చేసింది. ఆ క్రమంలో ఆయనకు జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించడమే కాదు… కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడందంటూ నిషేధం కూడా విధించింది. ఈ నేపథ్యంలో రాంచీలోని బిశ్రా ముండా జైల్లోకి ఆయన వచ్చి పడ్డారు. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతుండటంతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే తనకు బెయిల్ మరో మూడు నెలలు పోడిగించాలని హైకోర్టుకు ఆయన విన్నవించుకున్నారు. కానీ ఆయన అభ్యర్థనను హైకోర్టు నిర్ద్వందంగా తొసి పుచ్చింది. దీంతో ఆగస్టు 6వ తేదీన ఆయన కోర్టులో లోంగిపోయారు.  అలాగే రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన గారి అవినీతి చిట్టా… రైల్వే ప్రయాణికుల స్లీపర్ కోచ్ వెయిటింగ్ లిస్ట్ అంత ఉందని అప్పట్లో సెటైరికల్ కామెంట్స్ వైరల్ అయ్యాయిన సంగతి తెలిసిందే.

అలాగే ఐఆర్‌టీసీకి చెందిన హోటళ్లను ఆయన తన సన్నిహితులకు అప్పన్నంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లాలూ భార్య రబ్డీదేవి, ఆయన కుమారుడు తేజస్వీ యదవ్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. వారు బెయిల్‌పై విడుదలై ప్రస్తుతం బయటే ఉన్నారు. అలాగే లాలూ కుమార్తె మీసా భారతీ నివాసంపై ఐటీ శాఖలు దాడి జరిగాయి. ఈ క్రమంలో ఆమెకు వేల ఏకరాల భూములున్నట్లు కనుగొన్నారు. అంతేకాదు ఆమెపై మనీల్యాండరింగ్ కేసులు కూడా నమోదు అయ్యాయి.

అయినా తనకు పాడి అన్నా… పాడి అవులన్నా తనకు అత్యంత ఇష్టమని లాలూ ఎప్పుడు చెప్పుతుంటారు. చివరికీ పశువుల దాణా కుంభకోణంలోనే శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకోని మరీ ఊచలు లెక్కపెడుతున్నారు.

అయితే తాజాగా ఆయన రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆసుపత్రిలో తనకు కేటాయించిన వార్డులో పరిస్థితులు అంతగా బాగోలేదని ఆయన ప్రధాన ఆరోపణ. వీధికుక్కల అరుపులతో ఆయనకు నిద్ర పట్టడం లేదంట. వాటిని అక్కడ నుంచి తరలించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అలాగే ఆసుపత్రిలోని బాత్ రూమ్‌లు దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయంట…   దోమలు ఒక్కటే కుట్టి పెడుతున్నాయనీ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా కంటికి ఇంతకునుకు లేకుండా పోయిందని ఆయన తెగ ఫీలైపోతున్నారు. ఈ నేపథ్యంలో తనను సూపర్ స్పెషాలటీ వార్డుకు మార్చాలంటు ఇటు జైలు అధికారులకు… అటు వైద్యులకు లాలూ ప్రసాద యదవ్ లేఖ రాశారు. మరీ ఈ విషయంలో సదరు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఏది ఏమైనా దేశంలో వీఐపీల సంస్కృతి పెచ్చురిల్లింది. చివరకు స్వామీజీలే కాదు.. అమ్మలు…. చిన్నమ్మలు అంతా ఆదాయానికి మించిన ఆస్తులు, స్కాముల కేసుల్లో జైళ్లకు క్యూలు కడుతున్నారు. జైల్లో సౌకర్యాల విషయంలో అయితేనేమి… ఆహారం విషయంలో అయితేనేమీ వారు తీవ్ర అసంతృప్తితో ఫీలవుతున్నారు. దీంతో జైళ్లలో తమకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ వారు కోర్టులకు విన్నవించుకుంటున్నారు. అందుకు దేశంలోని ఏ రాష్ట్రంలోని నాయకులు కూడా అందుకు మినహాయింపు కాదు. ఆ విషయంలో అందరి దారీ ఒక్కటే అన్నది సుస్పష్టం.

 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అయితేనేమీ… అన్నాడీఎంకే నాయకురాలు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఆమె నెచ్చలి శశికళ అయితేనేమీ… సహారా అధిపతి సుబ్రతారాయ్ అయితేనేమీ.. భారతీయ బ్యాంకులను పుట్టి ముంచి విదేశాలకు చెక్కేసిన ప్లే బాయ్ విజయ్ మాల్యాకు అయితేనేమీ… చంచల్ గూడ జైలు అయినా… కర్ణాటకలోకి పరప్పన్ అగ్రహరం జైలు అయినా.. తీహార్ జైలు అయినా.. ముంబైలోని అర్థర్ జైల్ అయినా ప్రజా ధనాన్ని కైంకర్యం చేసిన నేతలను బట్టి జైలు గదుల్లో మార్పులు చేర్పులు చేసుకుంటాయి. చేసుకుంటున్నాయి.

మరి నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించినప్పుడు.. ఎందరో నాయకులతో భారతీయ జైళ్లు కిక్కిరిసిపోయాయి. జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితర హేమాహేమీలు జైళ్లలో మగ్గారు. అలాగే ఆ సమయంలో తెలుగునాట కూడా పలువురు కవులు, రచయితలు అరెస్ట్ అయ్యారు.

అందుకు ఉదాహరణకు రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆయన జైల్లో ఉన్న సమయంలో రత్తాలు రాంబాబు అనే నవల రాసి పారేశారు. ఆయనంటే రచయిత. కనుక ఆ పని చేశారు. అలాగే మరికొందరు అయితే తమ జీవిత చరిత్రలు రాశారు. వాళ్లు… వాళ్ల పని చేశారు. మరీ వీరందరికీ రానీ ఆలోచనలు మన మహానేతలకు వచ్చాయంటే దేశం పురోగమిస్తుందనేగా అర్థం. పరమార్థం.

 

 

కానీ ప్రజలను పాలిస్తామంటూ వచ్చి.. మహానేతలు, జననేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి ప్రజాధనాన్ని దోచుకుని మహా మేత మేస్తున్న నేతలకు జైళ్లలో రాజభోగాలు కావాలి!

ఇదంతా కోట్లకు కోట్లు కొల్లగొట్టిన  బడా నేతలకే ఈ రాజభోగాలు.. జేబు దొంగలు, పాడు పొట్ట కోసం తప్పులు చేసి.. వాళ్లకి.. జీవితంలోనే కాదు జైళ్ల గదుల్లో కూడా బతుకులు బాగుపడటం లేదు. అదే కదా చిత్రం. ఏదీ ఏమైనా ఎంత ఫ్యాన్‌కి అంత గాలి. ఎంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తే…వాళ్లకి జైళ్లలో అంత రాజభోగమన్నమాట!

ఏది ఏమైనా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి  డెబ్బై ఏళ్లయినా- దేశ ప్రగతి మాటేమోగాని…సో కాల్డ్ రాజకీయ ఖైదీలకు మాత్రం జైళ్లు కొత్త అల్లుళ్లకు దొరికిన అత్తారిళ్ల లాగా సకల సౌకర్యాలతో ముస్తాబైపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో అంతా సమానులే. కానీ కొంత మంది మాత్రం ఎక్కువ సమానులన్నమాట!

– జి.వి.వి.ఎన్. ప్రతాప్