రాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గమ్మ

08 October, 2019 - 7:47 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: శరన్నవరాత్రి పర్వదినాల చివరిరోజు విజయదశమి రోజు మంగళవారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అని కూడా పిలుచుకుంటారు. లోకాలన్నింటికి ఈమె ఆరాధ్య దేవత. రాక్షసులను అమ్మవారు వధించి, లోకానికి శాంతి సౌభాత్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమి పర్వదినం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీచక్రాన్ని అధిష్టించి, యోగమూర్తిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. రాజరాజేశ్వరీదేవిని పూజించడం ద్వారా మనో చైతన్యం ఉద్దీపితం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించే నేర్పు కలిగి ఉండడం, ఉన్నతమైన భావనలను వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి మహిళలు పొందాల్సిన స్ఫూర్తి. త్రిమూర్తుల కన్నా రాజరాజేశ్వరి ఉన్నతమైన స్థానం కలిగి ఉంటుంది. ప్రపంచంలో అన్నింటికన్నా మహిళలకే ఉన్నత స్థానం ఉందనేందుకు ఇదే నిదర్శనం. పరిపూర్ణతకు రాజరాజేశ్వరి చిహ్నం అంటారు.